ముత్తిరెడ్డికి ఎస‌రు!.. జ‌న‌గామ‌పై బీఆర్ఎస్ మైండ్ గేమ్‌..?

by Javid Pasha |   ( Updated:2023-01-30 10:17:57.0  )
ముత్తిరెడ్డికి ఎస‌రు!.. జ‌న‌గామ‌పై బీఆర్ఎస్ మైండ్ గేమ్‌..?
X

దిశ‌, వరంగ‌ల్ బ్యూరో : నోరొక‌టి మాట్లాడితే.. నొస‌లోక‌టి చెప్పిన‌ట్లుగా ఉంటోంది జ‌న‌గామ అసెంబ్లీ స్థానంపై బీఆర్ఎస్ అధిష్ఠానం వ్య‌వ‌హార‌శైలి. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని మ‌రొక‌రికి టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని ప‌లుమార్లు వేదిక‌ల‌పై ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌న‌గామ విష‌యంలో సెకండ్ ఓపినియ‌న్‌తో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. స్ప‌ష్ట‌మైన ఓ మైండ్ గేమ్ స్ట్రాట‌జీతో ఉన్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది. ముత్తిరెడ్డికే టికెట్ అంటూనే బాధ్య‌త‌ల‌న్నీ కూడా ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డికే అప్ప‌గించ‌డం వెనుక అధిష్టానం వ్యూహాత్మ‌క అడుగులే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌లు కూడా ధ్రువీక‌రిస్తున్నారు. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త స్వ‌రాలు, అనేక వివాదాలు నెల‌కొన్నాయ‌న్న అభిప్రాయం పార్టీలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలో ముత్తిరెడ్డిని బ‌రిలోకి దింపితే ఈసారి పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోక త‌ప్ప‌ద‌న్న అభిప్రాయాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈచ‌ర్చ చాలా రోజులుగా జ‌రుగుతున్న‌దే. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ వాద‌నతో ఏకీభ‌వించేవాళ్ల సంఖ్య ప్ర‌స్తుతం జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మానార్హం.

రానురానంటూనే.. నియోజ‌క‌వ‌ర్గంపై ఎమ్మెల్సీ ప‌ట్టు..!

త‌న‌కు జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డ‌మూ సుత‌రామూ ఇష్టం లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి.. ఓ సారి ఏకంగా ప్రెస్‌మీట్ కూడా నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న పార్టీ ప్ర‌తి ప‌నికీ, ప్ర‌భుత్వం నిర్వ‌హించే ప్ర‌తీ కార్య‌క్ర‌మ బాధ్య‌త‌లు ఆయ‌నకే అప్ప‌గించ‌డం వెనుక అధిష్టానం స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న ఉంద‌ని తెలుస్తోంది. జ‌న‌గామ‌లో రైతు నిర‌స‌న‌లు, క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం, జ‌న‌గామ‌లో భారీ బ‌హిరంగ స‌భ స‌హా అనేకానేక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ పూర్తి బాధ్య‌త‌ల‌ను పోచంప‌ల్లి భుజ‌స్కందాల‌పై అధిష్టానం వేయ‌డం వెనుక వ్యూహాత్మ‌క వైఖ‌రి దాగి ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో అవకాశాలు, ముప్పులు చెప్పిరావు.. వ‌స్తుంటూనే గుర్తించాల‌ని ముత్తిరెడ్డితో చ‌నువుగా ఉండే నేత ఒక‌రు హెచ్చ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచ‌ర వ‌ర్గానికి స‌మానంగా ఎమ్మెల్సీ త‌యారు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ సైలెంట్‌గా జ‌న‌గామ‌లో రాజ‌కీయ పునాదులు ఏర్ప‌రుచుకుంటున్నార‌నే వాద‌న బీఆర్ఎస్‌లో బ‌లంగా వినిపిస్తోంది.

కేసీఆర్ స్ట్రాట‌జీ.. కేటీఆర్ డైర‌క్ష‌న్‌..!

నేటి జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ ప‌రిస్థితిని ముందే ఊహించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగానే ఎమ్మెల్సీ పోచంప‌ల్లిని యాక్టివ్ చేసేందుకు పావులు క‌దిపిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. మునిసిప‌ల్ మ‌రియు ఐటీ శాఖ‌ల మంత్రి కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు, స్నేహితుడు. పోచంప‌ల్లిని ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లో యాక్టివ్ చేసేందుకు తెర‌వెనుక కృషి చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌మీప భ‌విష్య‌త్‌లో జిల్లా రాజ‌కీయాల్లో అత్యంత‌ క్రియాశీల‌ పాత్ర పోషించే విధమైన ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ఎమ్మెల్సీని జ‌న‌గామ బ‌రిలోకి దించేందుకు ర‌చ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆర్థికంగా చాలా బ‌ల‌మైన శ‌క్తిగా కూడా ఎమ్మెల్సీ ఉండ‌టంతో పార్టీలో త‌గినంత ప్రోత్సాహం క‌ల్పిస్తే పార్టీకి ద‌న్నుగా త‌యార‌వుతాడ‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్లు బీఆర్ఎస్‌లోని ఓ కీల‌క నేత అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌గామ అసెంబ్లీ సెగ్మెంట్‌పై బీఆర్ ఎస్ అధిష్టానం వ్యూహాత్మ‌క వైఖ‌రేంటో కొద్దిరోజుల్లేనే బ‌య‌ట‌ప‌డ‌నుంది.

READ MORE

లక్షల మందితో బీఆర్ఎస్‌లో చేరితే నమ్మక ద్రోహం చేశారు: Ponguleti Srinivas Reddy

Advertisement

Next Story