ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ నేత పాగా !

by Aamani |
ప్రభుత్వ  స్థలంలో బీఆర్ఎస్ నేత పాగా !
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : క‌బ్జా చేస్తా..! ఎవ‌రేం చేస్తారో చూస్తా అన్నట్లుగా ఉంది ఏనుమాముల‌లోని ఓ గులాబీ లీడ‌ర్ తీరు. ఏనుమాముల గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 195లోని సుమారు 250గ‌జాల స్థలాన్ని హ‌స్తగ‌తం చేసుకునేందుకు స‌ద‌రు నేత కొన్నాళ్లుగా ప్రయ‌త్నాలు చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లున్నాయి. వ‌రంగ‌ల్ మండ‌లం ప‌రిధిలోని ఏనుమాముల గ్రామం శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వెనుక స‌ద‌రు లీడ‌ర్ పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. కాల‌నీలోని హ‌నుమాన్ ఆల‌యం ప‌క్కన ఉన్న స్థలాన్ని క‌బ్జా చేసేందుకు స‌ద‌రు గులాబీ లీడ‌ర్ ప్రయ‌త్నం చేస్తున్నట్లుగా గ‌తంలో మండ‌ల రెవెన్యూ అధికారిస్వయంగా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. స‌ద‌రు స్థలంలో ఓ రేకుల షెడ్డు వేయ‌డంతో పాటు నిర్మాణాల ఆన‌వాళ్లు క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

రెవెన్యూ అధికారుల‌కు బెదిరింపులు..?!

తాజాగా వ‌రంగ‌ల్ ఎమ్మార్వోగా విధుల్లో ఉన్న ఇక్బాల్ సైతం స‌ద‌రు ఆక్రమ‌ణ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయ‌త్నించ‌గా స్థానిక జ‌నంతో క‌లిసి బెదిరింపుల‌కు పాల్పడిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ఎమ్మార్వో ఇక్బాల్ స్థల ప‌రిశీల‌న చేసేందుకు వెళ్లగా స్థానిక మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆయ‌న వాహ‌నాన్ని అడ్డుకోవ‌డంతో పాటు దాడికి య‌త్నాలు జరిగిన‌ట్లుగా ఏనుమాముల పోలీస్ స్టేష‌న్‌లో కేసు కూడా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన స‌త్యపాల్‌రెడ్డి, ప్రస్తుతం ఎమ్మార్వోగా ఉన్న ఇక్బాల్‌పై స్థానికులు దురుసుగా ప్రవ‌ర్తించ‌డం వెనుక స‌ద‌రు బీఆర్ఎస్ లీడ‌ర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ హ‌యాంలోనే ప్రభుత్వ భూమి క‌బ్జాకు స‌ద‌రు నేత య‌త్నించ‌గా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటూ వ‌స్తున్నారు. 2023లో నాటి త‌హ‌సీల్దార్ స‌త్యపాల్ రెడ్డి ఏనుమాముల పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ప్పటికీ నాటి ప్రజాప్రతినిధి సాయంతో ఎఫ్ఐ ఆర్ కాకుండా స‌ద‌రు బీఆర్ ఎస్ లీడ‌ర్‌ మేనేజ్ చేసిన‌ట్లు స‌మాచారం.

చెరువు స్థలం.. అయాన్ క‌న్వర్షన్‌..!

ఏనుమాముల గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని రామ‌స‌ముద్రం శిఖం భూమి 20 ఎక‌రాల 5గుంట‌లు ఉండేది. చెరువుకు పైనుంచి వ‌ర‌ద లేక‌పోవ‌డంతో శిఖం భూముల‌ను అయాన్ క‌న్వర్షన్ ద్వారా ప్రభుత్వ భూమిగా మార్చాల‌ని నాటి వ‌రంగ‌ల్‌ క‌లెక్టర్ వాకాటి క‌రుణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాద‌న‌ల‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ 2016లో మంత్రి మండ‌లి స‌బ్ క‌మిటీ ఆమోదం త‌ర్వాత‌ అయాన్ క‌న్వర్షన్ చేప‌ట్టింది. చెరువు శిఖం భూముల‌ను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో మార్పులు చేసింది. అయితే ఈ ప‌రిణామం కంటే ముందే శిఖం భూముల్లో కొంత‌మంది గుడిసెలు, ప‌క్కా నిర్మాణాలతో కూడిన ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే శిఖం భూముల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారంద‌రికీ కూడా డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం జ‌రుగుతుంద‌ని నాటి క‌లెక్టర్ క‌రుణ హామీ ఇచ్చారు. శిఖం భూముల్లోని నిర్మాణాల‌ను తొల‌గించేశారు. క‌లెక్టర్ హామీ ప్రకారం అర్హులైన వారంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అయితే ఇందులోనూ కొంత‌మంది ఆక్రమ‌ణ‌ల‌కు తెర‌లేపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంత‌మంది త‌ప్పుడు పేర్లతో డ‌బుల్ బెడ్‌రూం కింద రెండు, మూడు ఇళ్లను పొందిన‌ట్లుగా ఆరోప‌ణ‌లుండ‌టం గ‌మ‌నార్హం.

2200 గ‌జాల స్థలంలో ఆక్రమ‌ణ‌లు..!

గ‌తంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన స‌ర్వేలో స‌ర్వే నెంబ‌ర్ 195లో 2200గ‌జాల ప్రభుత్వం స్థలం ఉంద‌ని, 11 చోట్ల చిన్న విస్తీర్ణాల‌తో ఉంద‌ని గుర్తించారు. అయితే క్రమంగా ఈ స్థలాలు ఆక్రమ‌ణ‌ల‌కు, అన్యాక్రాంత‌మ‌వుతూ వ‌స్తున్నాయి. అక్కడ‌క్కడా చిన్నపాటి విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలాలను సెల్ఫ్ రిజిస్ట్రేష‌న్ల పేరుతో కొంత‌మంది త‌మ వశం చేసుకుంటున్నారు. తాజాగా బ‌తుక‌మ్మ ఆట స్థలంగా వినియోగించుకుంట‌ున్న 250 గ‌జాల స్థలంపై ఓ గులాబీ లీడ‌ర్ క‌న్నేసి ఆక్రమ‌ణ‌కు య‌త్నిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. తాజాగా ఏనుమాముల వైపు భూముల విలువ పెర‌గ‌డంతో కాల‌నీవాసులు బ‌తుక‌మ్మ ఆట స్థలంగా వినియోగించుకుంటున్న ప్రభుత్వం స్థలంపై స‌ద‌రు బీఆర్ఎస్ నేత క‌న్ను ప‌డిన‌ట్లు స‌మాచారం. దీనిపై ప్రభుత్వం సీరియ‌స్‌గా దృష్టి పెట్టి స్వాధీనం చేసుకుని హ‌ద్దులు ఏర్పాటు చేయాల‌ని శ్రీన‌గ‌ర్ కాల‌నీవాసులు వ‌ర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ‌రాజుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story