ఓరుగల్లు ‘నియో’పై రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్.. మెట్రో రైల్ ప్రాజెక్టుపై నీలినీడలు

by Mahesh |
ఓరుగల్లు ‘నియో’పై రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్.. మెట్రో రైల్ ప్రాజెక్టుపై నీలినీడలు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఓరుగల్లులో ప్రతిష్టాత్మకంగా చేపడుతామని ప్రకటించిన ‘నియో’ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2019లో మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ఘ‌నంగా ప్రకటించారు. డీపీఆర్ త‌యారు చేసే బాధ్యతలను 2020లో మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అప్పగించారు. హెచ్‌ఎండీఏ ట్రాన్స్‌ పోర్ట్‌ హెడ్‌ విజయలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్కే సిన్హా, కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ప్లానింగ్‌ అధికారి అజిత్‌ రెడ్డి సహకారంతో 2021లో డీపీఆర్ తయారీ పూర్తి చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్‌ (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకున్నారు.

గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సంస్థల నుంచి 60 శాతం నిధులను రుణంగా, మిగతా 40 శాతం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20శాతం భ‌రించేలా వ్యయ ప్రణాళికను రూపొందించారు. ప్రాజెక్టుకు రూ.1100 కోట్ల వ్యయమవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఏడు కిలోమీటర్ల మేర భూమార్గంలో, మరో ఎనిమిది కిలోమీటర్ల మేర ఆకాశమార్గంలో ఉండేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. డీపీఆర్‌ను 2021లో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప‌లు సూచ‌న‌లు చేస్తూ, మరోసారి ప్రతిపాదనలు పంపించాలని సూచించింది.

మరోసారి పంపడంలో నిర్లక్ష్యం..

నియో ప్రాజెక్టును అధ్యయనం చేసిన కేంద్ర అధికారులు పలు మార్పులు సూచించారు. మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. అయితే ఏడాది గడుస్తున్నా ప్రాజెక్టు ప్రతిపాదనలను రాష్ట్ర సర్కారు పంపించలేదు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ 2022 డిసెంబర్ లో రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన తర్వాతైనా డీపీఆర్ పంపే పనిని రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేస్తుందని భావించినా, అది జరగలేదు.

వ్యయం కూడా త‌క్కువే..

కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై ఫాతిమా నగర్, సుబేదారి, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్‌ నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు ఒక ద‌శ‌గా, అక్కడి నుంచి స్టేషన్‌ రోడ్డు, వరంగల్‌ చౌరస్తా, మండి బజార్, పోచమ్మమైదాన్‌ ను అనుసంధానించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. వాస్తవానికి హైద‌రాబాద్ మెట్రో వ్యయం క‌న్నా వ‌రంగ‌ల్‌లో చేపట్టనున్న నియో ప్రాజెక్టుకు అంచ‌నా వ్యయం కూడా చాలా త‌క్కువేన‌ని మ‌హా మెట్రో డీపీఆర్‌లో పేర్కొన్నది. సాధారణ విధానంలో అయితే కిలోమీటర్ నిర్మాణానికి రూ.180 కోట్ల వ్యయం చేయాల్సి ఉండ‌గా, తాజా డీపీఆర్ ప్రకారం కిలోమీటర్ కు రూ.60కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే స‌రిపోతుంద‌ని వివరించింది. ఈ కొత్త నియో మెట్రో విధానానికి వరంగల్ రోడ్లు కూడా సరిపోతాయని వెల్లడించింది.

అందరూ ఖామూష్

వ‌రంగ‌ల్ పట్టణాభివృద్ధిలో నియో రైలు ప్రాజెక్టు ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌ని, ఈ ప్రాజెక్టు పూర్తయితే వ‌రంగ‌ల్ హైద‌రాబాద్‌‌కు దీటుగా అభివృద్ధి చెందుతుంద‌ని మంత్రి కేటీఆర్ 2019లో, ఆ త‌ర్వాత పలు సంద‌ర్భాల్లోనూ వ్యాఖ్యానించారు. 2020లో వ‌రంగ‌ల్ పర్యటనలో భాగంగా మెట్రో ప్రాజెక్టుపై హన్మకొండ కలెక్టరేట్లో ప్రత్యేకంగా రివ్యూ చేశారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభ‌మ‌వుతుంద‌ని కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆ త‌ర్వాత మాత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగ‌తి లేదు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపకపోవడంపై ఓరుగల్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story