ఓరుగ‌ల్లుపై బీజేపీ ఫోక‌స్‌.. భారీగా చేరిక‌ల‌కు ప్లాన్‌..!

by Mahesh |   ( Updated:2023-12-17 14:52:35.0  )
ఓరుగ‌ల్లుపై బీజేపీ ఫోక‌స్‌.. భారీగా చేరిక‌ల‌కు ప్లాన్‌..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఓరుగ‌ల్లుపై బీజేపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిందా..? క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర వ్యాప్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లోనూ మార్పులు చోటు చేసుకునున్నాయా..? అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌లోని అసమ్మతి, రాజ‌కీయ అవ‌కాశాల్లేక‌, అప్రాధాన్యంగా ఉన్నామ‌ని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ స్థాయి, మండ‌ల స్థాయి నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైందా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వాస్తవానికి కొద్దిరోజుల రాజ‌కీయ వ్యూహా ర‌చ‌న‌తో ముందుకెళ్లిన బీజేపీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేశాకే చేరిక‌ల విష‌యంలో ముందుకెళ్లాల‌ని భావించిన‌ట్లు స‌మాచారం. జ‌నంలో ప్రాభ‌వం క‌లిగిన నేత‌ల శోధిస్తున్నట్లు వినికిడి.

అసంతృప్తుల‌పై ఆరా..!

అంకితభావంతో ప‌నిచేస్తున్నా ఆయా పార్టీల్లో ప్రాధాన్యం లేకుండా ఉన్న ఆరు జిల్లాల నేత‌ల జాబితా బీజేపీ అధినాయ‌క‌త్వం వ‌ద్దకు చేరిన‌ట్లు స‌మాచారం. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల్లోని కీల‌క నేత‌ల‌తో పాటు ద్వితీయ శ్రేణి నేత‌ల‌పైనా ఫోక‌స్ పెట్టనున్నట్లు స‌మాచారం. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ అసమ్మతితో ర‌గిలిపోతున్న అనేక మంది లీడ‌ర్లు బీజేపీ ఎమ్మెల్యే, బీజీపీ చేరిక‌ల క‌మిటీ చైర్మన్​ఈట‌ల రాజేంద‌ర్‌కు ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. కొందరు పేర్లను కూడా బీజేపీ నేత‌లు బాహాటంగానే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేకత ఎక్కువ‌గా ఉన్న సీట్లలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా చేరిక‌ల్లో వేగం పెంచాల‌ని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఫోక‌స్‌..!

వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, ప‌ర‌కాల‌, న‌ర్సంపేట‌, జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై బీజేపీ ప్రత్యేకంగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. విద్యావంతుల ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న సెగ్మెంట్లు ఉన్నచోట పార్టీకి ఆద‌ర‌ణ ఉంటోంద‌న్న విశ్లేష‌ణ చేస్తున్నారు. అందులో భాంగానే ఆరు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ముందుగా ఫోక‌స్ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత చేరిక‌లు మొద‌ల‌వుతాయ‌ని చెబుతున్నారు.

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలుస్తార‌ని తెలుస్తున్న డాక్టర్​కాళీ ప్రసాద్ చేరిక కూడా ఈనెల‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి సొంత ఇమేజ్‌తో దూసుకెళ్తున్న మాజీ ప్రజాప్రతినిధి చేరిక ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో మాజీ కార్పొరేట‌ర్లతో పాటు ఈట‌ల‌తో నేరుగా సుప‌రిచితం క‌లిగిన నేత‌లు సైతం బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.


Advertisement

Next Story