ఫాం ల్యాండ్ల పేరిట ప‌త్తిప‌ల్లిలో ఘ‌రానా మోసం.. మొత్తం ఆయన స‌హ‌కారంతోనే!!

by GSrikanth |   ( Updated:2022-09-08 04:24:48.0  )
ఫాం ల్యాండ్ల పేరిట ప‌త్తిప‌ల్లిలో ఘ‌రానా మోసం.. మొత్తం ఆయన స‌హ‌కారంతోనే!!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ములుగు జిల్లా కేంద్రానికి స‌మీపంలోని ప‌త్తిప‌ల్లి గ్రామంలో ఫాం ల్యాండ్ ముసుగులో రియ‌ల్ మోసం జ‌రుగుతోంది. ఫాం ల్యాండ్ పేరిట‌ అక్రమ లే అవుట్ ప్లాట్లను అమాయ‌క ప్రజ‌ల‌కు అంట‌గ‌డుతూ పెండ్యం ఇన్ఫ్రా డెవ‌ల‌ప‌ర్స్ అనే ఎలాంటి అనుమ‌తులు పొంద‌ని సంస్థ ఘ‌రానా మోసాల‌కు పాల్పడుతోంది. చెట్ల పేరు చెప్పి కాయ‌ల‌మ్మిన చందంగా ములుగు ప‌ర్యాట‌క పేరు చెప్పి.. ప్రకృతి, వ్యవ‌సాయం అంటూ 120 గ‌జాల భూమిని రెండు లక్షల‌కు అంట‌గంటి దండిగా జేబులు నింపుకుంటోంది. ఈ అక్రమాల‌న్నింటిని అడ్డుకోవాల్సిన ములుగు త‌హ‌సీల్దార్ స‌త్యనారాయ‌ణే మొత్తం క‌థ న‌డిపించ‌డం విశేషం.

100 ఎక‌రాల్లో.. వేల సంఖ్యలో ప్లాట్లు..!

ములుగు మండ‌లం ప‌త్తిప‌ల్లి గ్రామంలోని భూ స‌ర్వే నెంబ‌ర్లు 591, 592, 593, 594, 613, 614ల ప‌రిధిలో సుమారు 100 ఎక‌రాల్లో ఫాం ల్యాండ్ పేరిట ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ‌త ఏడాదిన్నర కాలంగా జ‌రుగుతున్న ఈ భూ దందాలో పేద‌లే అత్యధికంగా మోసపోతున్నారు. ఫాం ల్యాండ్‌లోని వివిధ ర‌కాల పండ్ల, వాణిజ్య మొక్కల పెంప‌కం జ‌రుగుతోంద‌ని, 10 ఏళ్లలో భూమి విలువ పెర‌గ‌డంతో పాటు వాణిజ్య చెట్ల పెంప‌కం ద్వారా రెట్టింపు ఆదాయం వ‌స్తుంద‌ని బురిడీ కొట్టిస్తున్నారు. గుంట మొద‌లు మూడు నాలుగు గుంట‌ల వ‌ర‌కు ప్లాట్లుగా చేసి విక్రయాలు చేప‌డుతున్నారు. ఇప్పటికే వంద‌ల సంఖ్యలో ప్లాట్ల అమ్మకం పూర్తయ్యాయి. ఫాంల్యాడ్ ప్లాట్ల పేరుతో జ‌రుగుతున్న మోసాల‌ను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారే అక్రమాల‌కు ఆద‌రువుగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఫాం ల్యాండ్స్ నిర్వాహకుల‌తో కుదిరిన ఒప్పందమో, మంచి మ‌ర్యాదో తెలియ‌దు గాని ములుగు త‌హ‌సీల్దార్ మాత్రం వంద‌ల ప్లాట్లు రిజిస్ట్రేష‌న్లు చేసేయ‌డం గ‌మ‌నార్హం.

పెండ్యం ఎడా పెడా దోపిడీ

టూరిజం జిల్లాగా పేరుగాంచిన ములుగులోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చూపుతూ ప‌ట్టణ ప్రజ‌ల‌ను పెండ్యం గ్రూపు మోసాల‌కు పాల్పడుతోంది. ఎలాంటి అనుమ‌తి పొంద‌కుండానే వెంచ‌ర్లుగా పేర్కొంటూ ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు.. ప్రతీ ప్లాట్లుకు 30 ఫీట్ల రోడ్డు, మెయిన్ రోడ్డు 50 ఫీట్ల వెడ‌ల్పుతో ఉంటుంది, 24గంట‌ల పాటు సెక్యూరిటీ ఉంటుంద‌ని, దానిమ్మ, ఉసిరి, జామ‌, సీతాఫ‌లం త‌దిత‌ర పంట‌ల‌తో మీకు అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని పేర్కొంటూ బ్రౌచ‌ర్లలో క‌ల‌రింగ్‌, మాట‌ల్లోనే ఆదాయ మార్గాలు చూపి అమాయ‌కుల‌ను మోసం చేసేస్తోంది. అదే స‌మ‌యంలో ఇల్లుక‌ట్టుకోవ‌చ్చని న‌మ్మబలుకుతూ చిన్న మొత్తాల‌తో కూడా కొనుగోళ్లు జ‌ర‌ప‌వ‌చ్చంటూ నెల‌కు రూ.2500లు క‌డితే సరిపోతుందంటూ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల ఆశ‌ల‌ను త‌ట్టిలేపి పుట్టి ముంచుతోంది. 120 గ‌జాల ప్లాటు ధ‌ర‌ను రూ.2ల‌క్షల నుంచి రెండున్నర ల‌క్షల మ‌ధ్య విక్రయిస్తున్నారు. ఆఫ‌ర్లు ప్రక‌టిస్తున్నారు. వాస్తవానికి నెలవారీ మొత్తాల గ్రూపులో చేరిన కొంత‌మంది కొద్దికాలం త‌ర్వాత మొత్తాల‌ను స‌క్రమంగా చెల్లించ‌క‌పోవ‌డంతో వారి డ‌బ్బును తిరిగివ్వడం లేద‌ని తెలిసింది. అంతేకాదు.. రెండు మూడు మాసాల్లోనే ఈ రియ‌ల్ బాగోతం తెలుసుకుని.. నిండా మునిగిపోకుండా ఒడ్డున ప‌డ్డవారూ ఉన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు చేసిన ఈ అక్రమ వెంచ‌ర్లోని కొంత భూమి కూడా వివాదాస్పద‌మైంద‌ని కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.

మొత్తం త‌హ‌సీల్దార్ స‌హ‌కారంతోనే...

ములుగు త‌హ‌సీల్దార్ భూ అక్రమ రిజిస్ట్రేష‌న్లకు తెగ‌ప‌డ్డారు. ములుగు మండ‌లం ప‌త్తిప‌ల్లి గ్రామంలో పెండెం ఇన్ఫా డెవ‌ల‌ప‌ర్స్ పేరిట నిర్వహిస్తున్న ఫాం ల్యాండ్స్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్లు ఎడ‌పెడా చేసేస్తున్నారు. ఫాం ల్యాడ్స్ ముసుగులో కొన‌సాగుతున్న రియ‌ల్ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారే బాజాప్త రిజిస్ట్రేష‌న్లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. నాన్ లే అవుట్‌, ఫాం ల్యాండ్స్ పేరుతో జ‌రుగుతున్న గుంట‌, రెండు మూడు గుంట‌ల భూముల‌ను రిజిస్ట్రేష‌న్లు చేయవ‌ద్దని ప్రభుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు స‌వివ‌రమైన ఆదేశాల‌ను ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధ‌న‌ల ప్రకారం 10 గుంట‌ల కంటే మించి ఉన్న భూమిని మాత్రమే బై నెంబ‌ర్లతో రిజిస్ట్రేష‌న్లు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ములుగు త‌హ‌సీల్దార్ స‌త్యనారాయ‌ణ తుంగ‌లో తొక్కి య‌థేచ్ఛగా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నారు. ప్రస్తుత త‌హ‌సీల్దార్ స‌త్యనారాయ‌ణ హ‌యంలోనే వంద‌ల ప్లాట్లు రిజిస్ట్రేష‌న్లు జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. ప‌త్తిప‌ల్లి కేంద్రంగా జ‌రుగుతున్న ఫాం ల్యాండ్ రియ‌ల్ మోసంపై క‌లెక్టర్ కృష్ణ ఆదిత్య స్వయంగా దృష్టి సారిస్తే త‌హ‌సీల్దార్‌తో పాటు ఇత‌ర రెవెన్యూ అధికారుల పాత్ర బ‌హిర్గతం కానుంది. మ‌రి జిల్లా బాస్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Also Read : రాష్ట్ర మంత్రి అండతో తతంగం.. అక్షరాలా ఆ భూమి విలువ రూ.300 కోట్లు!!

Advertisement

Next Story

Most Viewed