ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

by Disha Web Desk 15 |
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
X

దిశ,జనగామ : అధికారులు పారదర్శకంగా ఎన్నికలను చేపట్టాలని, జవాబుదారీతనంతో పని చేయాలని భువనగిరి- 14 పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సయాన్ దేబర్మ అన్నారు. శనివారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, డీసీపీ సీతారాంలతో కలిసి భువనగిరి - 14 పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సయాన్ దేబర్మ లోక్ సభ ఎన్నికల విధుల నిర్వహణ పనితీరుపై ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ.. రోజువారీగా నివేదికలను నిర్దేశించిన సమయంలో అందజేయాలన్నారు. మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిని నియంత్రించేందుకు చెక్ పోస్ట్ లపై గట్టి నిఘా పెంచాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ , స్టాటిక్ సర్వేలెన్స్ , వీడియో సర్వేలెన్స్ టీంలు పకడ్బందీగా పనిచేయాలని సూచించారు.

సీ-విజిల్ యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందిచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలని, లైసెన్స్ లేని బెల్ట్ షాపులను అధిక సంఖ్యలో గుర్తించి సీజ్ చేయాలన్నారు. ఎన్నికల ప్రచార సమావేశాలను పూర్తిస్థాయిలో వీడియో కవరేజీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు 1950 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కు వెంటనే స్పందించాలని, ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. బ్యాంకుల ఖాతాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్జీవోలకు సంబంధించి ఖాతాల లావాదేవీల వివరాలపై తక్షణం నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమీకృత కంట్రోల్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా సీ-విజిల్ కు సంబంధించి ఫిర్యాదుల వివరాలను సంబంధిత టీమ్ ను అడిగి తెలుసుకున్నారు. సీ - విజిల్ యాప్ ద్వారా వచ్చే

ఎన్నికల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ల పని తీరును పర్యవేక్షించారు. స్టాటిక్ సర్వేయిలన్స్ టీమ్ పని విధానాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, తగు సూచనలు చేశారు. 1950 కాల్ సెంటర్ ను సందర్శించి, రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ మేరకు పోలింగ్ (మే 13)కు చివరి 72 గంటలు ఎంతో ముఖ్యమని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల వారీగా చెక్ పోస్టులు (3) ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులకు కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ అనిల్ కుమార్, ఎలెక్టోరల్ రోల్ నోడల్ అధికారి, డీఆర్డీఓ మొగులప్ప, ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి వై. రాజేందర్ రెడ్డి, మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి కుమారస్వామి, స్వీప్ నోడల్ అధికారి వినోద్ కుమార్, ఇతర సంబంధిత నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed