- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతుల్లేవ్..ఆపేది లేదు..ఏజెన్సీ ఏరియాలో రియల్టర్ల పెత్తనం
దిశ,నర్సంపేట: నర్సంపేట మండలం లో ఏకైక ఏజెన్సీ గ్రామమైన రాజుపేట లో అక్రమ కట్టడాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. 1/70 పెసా యాక్ట్ వర్తించే భూములు అధికారుల ధనదాహానికి క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల చేతివాటంతో నిబంధనలకు తూట్లు పడుతున్నాయి. వెరసి అటవీ ఉత్పత్తుల పై ఆధారపడి జీవించాల్సిన ప్రాంతం నేడు అక్రమ ఇండ్ల నిర్మాణాలకు నిలయంగా మారింది. పెసా చట్టం అమలులో ఉన్న రాజుపేట గ్రామంలో వారసత్వంగా వస్తున్న భూములను తరాలుగా అనుభవించాలని మాత్రమే చట్టం చెబుతోంది.
అయితే గడచిన కొన్నేళ్లుగా ఇక్కడ భూముల క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి తోడు జాతీయ రహదారి 365 రాజుపేట ఏజెన్సీ భూముల మధ్య నుంచి వెళ్తుండటంతో అక్రమార్కుల కన్ను ఆ భూములపై పడింది. గడచిన రెండు, మూడేళ్లలోనే శివారు ప్రాంతాల్లోనే దాదాపు 25 నుంచి 30 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా పోటీపడి మరీ షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమంగా వెలసిన ఇండ్ల నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని మరికొన్ని ఇండ్ల నిర్మాణాలకు షరామాములుగా ముగ్గు పోస్తూ అక్రమ నిర్మాణాల ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.
రాజుపేట నేపథ్యం...
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామం ఏజెన్సీ పరిధిలో ఉంది. 1/70 పెసా యాక్ట్ నిబంధనలు ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. నర్సంపేట మండలం లో ఏకైక ఏజెన్సీ గ్రామం కావడంతో గిరిజనులకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఇక్కడ భూముల క్రయవిక్రయాల పై నిషేధం. వారసత్వంగా వస్తున్న భూములపై హక్కులు కలిగి ఉండటం తప్ప విక్రయాలు చెల్లవని చట్టం చెబుతోంది. 2011 జనగణన ప్రకారం రాజుపేటలో 588 ఇండ్లు ఉన్నాయి. 2,168 జనాభాతో 974 హెక్టార్లలో అనగా దాదాపు 2వేల ఎకరాల్లో గ్రామం విస్తరించి ఉంది. షెడ్యూల్ తెగలకు చెంది 1,421 మంది ఉండగా, షెడ్యూల్ కులాలు 178 మంది, మిగతా సంఖ్యలో ఇతరులు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా గ్రామంలో మగవారి సంఖ్య 1051, మహిళల సంఖ్య 1117 ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గడచిన పదేళ్లలో గ్రామంలో ఇండ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం దాదాపు 200 పైగా ఇండ్ల నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం 650కి పైగా ఇండ్ల నిర్మాణం ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో గమనిస్తే స్పష్టం అవుతోంది. వీటిలో మెజార్టీగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం.
అనుమతులు లేవు..ఆపేది లేదు..!
నర్సంపేట పట్టణ శివారు కమలాపురం గ్రామం క్రాస్ రోడ్ దగ్గర నుంచి రాజుపేట గ్రామ శివారు మొదలవుతోంది. మండలంలోనే ఏకైక ఏజెన్సీ గ్రామం రాజుపేట కొన్నేళ్లుగా అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. ఒకప్పుడు పంటలతో దర్శనమిచ్చిన ఈ భూములు నేడు అక్రమ నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి. శివారు ప్రాంతాల్లోనే దాదాపు 20 నుంచి 30 ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్ని ముగ్గులు పోసి నిర్మాణానికి సిద్ధం అయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్ లో, పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు.
అనుమతి ఊసే ఉండదా..?
రాజుపేట గ్రామంలో ఇండ్ల నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే గ్రామ సెక్రటరీ సంబంధిత దరఖాస్తును పెసా చట్టం నిబంధనల ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు ఏజెన్సీ ప్రాంతమైన రాజుపేటలో ఏండ్లుగా అక్కడే స్థిర నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపెడితే సదరు వ్యక్తి ఇంటికి అనుమతి ఇవ్వాలి ఉంటుంది. ఇదిలా ఉండగా గడిచిన మూడు, నాలుగేళ్లలో అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్న వారిలో ఏ ఒక్కరికి ఇంటి నిర్మాణ అనుమతి ఇవ్వలేదని జీపీ కార్యదర్శి స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రాజుపేట గ్రామ శివారులో 25కి పైగా ఇండ్ల నిర్మాణం పూర్తి కావడం గమనార్హం.
చర్చల్లేవ్..మతలబేంటి..?
రాజుపేట గ్రామంలో అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలపై కనీస చర్యలకు అధికారగణం సాహసించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంటి నిర్మాణ అనుమతులు తిరస్కరించిన ప్పటికీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా చిన్న గోడ నిర్మాణం చేపడితే ఆఘమేఘాల మీద కూల్చేసే రెవెన్యూ సిబ్బంది రాజుపేట గ్రామంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు కారణమవుతోంది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడం కూడా అక్రమ కట్టడాల సంఖ్య పెరగడానికి కారణమని చర్చ జరుగుతోంది.
అక్రమ ఇండ్లకు ఇంటి నంబర్లు..?
అక్రమంగా నిర్మించిన ఇండ్లకు అనుమతి లేకున్నా ఇంటి నంబర్ల కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. జీపీ అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాలకు ఇంటి నంబర్లు, కరెంట్ కనెక్షన్ ఇస్తుండటం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గిరిజనేతరులు సైతం ఏజెన్సీ భూములు కొనడానికి పోటీ పడుతున్నారు.
గ్రామ అభివృద్ధి కోసం ఇంటి నంబర్లు: జీపీ కార్యదర్శి సాయి
రాజుపేట గ్రామ శివారులో అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న విషయం వాస్తవమే. ఇంటి నిర్మాణం కోసం కొందరు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేస్తున్నారు. సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో అనుమతులను తిరస్కరిస్తున్నాం. గడిచిన మూడు, నాలుగేళ్లలో ఏ ఇంటికి అనుమతి ఇవ్వలేదు. ఇల్లు పూర్తి అయిన వారు ఇంటి నెంబర్ కోసం సంప్రదిస్తున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. దీని కోసమే టెంపరరీ ఇంటి నంబర్లను కేటాయిస్తున్నాము.