మల్లన్నా మన్నించు..!

by Sumithra |
మల్లన్నా మన్నించు..!
X

దిశ, వర్ధన్నపేట : ఐనవోలు ఆలయ అభివృద్ధి పనుల పై అధికారులు, ప్రజాప్రతినిధులు అశ్రద్ధ చూపుతున్నారు. ప్రతి ఏటా జాతరకు వారం రోజుల ముందు సమీక్ష సమావేశాలు నిర్వహించి రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు పలుకుతున్న నేతలు జాతర పూర్తికాగానే పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొమురవెల్లి మల్లన్న జాతర తర్వాత అతిపెద్ద జాతరైన ఐనవోలు శ్రీ మల్లికార్జున జాతరకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తరలివస్తుంటారు. సంక్రాంతితో ప్రారంభమై ఉగాది వరకు మూడు నెలల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తుంటారు. సుమారు జాతరకు 10లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఆలయ అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది ఆలయ అభివృద్ధి కోసం మొదలు పెట్టిన పనులు మళ్లీ జాతర సమయం ఆసన్నమైనా పూర్తికాక పోవడం గమనార్హం. ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పట్లో ఆర్ అండ్ బీ అధికారులు మంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయలేదు..

క్యూలైన్లలో ఇబ్బంది పడ్డ భక్తులు..

గతేడాది దైవదర్శనానికి భక్తులకు సరిపడా క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారుల వైఫల్యంతో రూ.500 స్పెషల్ దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది. సరిపడా పారిశుధ్య కార్మికులను నియమించకపోవడంతో ఆలయ ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరమ్మతులకు నోచుకోని రోడ్లు..

మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు బైకులు, కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇల్లందు నుంచి ఐనవోలుకు వెళ్లే పది కిలోమీటర్ల మేర రోడ్డుమార్గం గుంతల మయంగా ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయమై దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రోడ్లకు మరమ్మతులు చేయాలని గతేడాది సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోలేదు. ఏడాది గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడం గమనార్హం.

జాతరలో బెల్ట్ షాపుల జోరు..

ఆలయ చుట్టుపక్కల గ్రామాల్లో గతేడాది బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ గుడుంబా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాప్, బెల్ట్ షాప్ అధికారులతో కుమ్మక్కై యథావిధిగా మద్యం అమ్మకాలు జరిపారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడన్నట్లుగా వ్యవహరించారు. మంత్రి హెచ్చరించినా బెల్ట్ షాపులు యథావిధిగా నడవడం గమనార్హం.

Advertisement

Next Story