ఏ పార్టీకి లొంగి పనిచేయను.. న్యాయం చేయడం నా బాధ్యత: వరంగల్ సీపీ

by GSrikanth |   ( Updated:2023-04-11 14:47:03.0  )
ఏ పార్టీకి లొంగి పనిచేయను.. న్యాయం చేయడం నా బాధ్యత: వరంగల్ సీపీ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: తాను సెటిల్మెంట్లు, దందాల‌కు పాల్పడిన‌ట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌కుమార్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఒక్కటైనా నిరూపించాల‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స‌వాల్ విసిరారు. తాను ఎలాంటి వాడినో ప్రజ‌లంద‌రికీ తెలుసున‌ని అన్నారు. ఖ‌మ్మంలో, న‌ల్గొండ‌లో ఎస్పీగా ప‌ని చేశాన‌ని, ఇప్పుడు ఇక్కడ ఐదు నెల‌లుగా ప‌నిచేస్తున్నాన‌ని అన్నారు. సామాన్య ప్రజ‌ల‌కు న్యాయం ద‌క్కాల‌నే ల‌క్ష్యంతో గ్రీవెన్స్‌లో కూడా కూర్చుని ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తుంటానని అన్నారు. గ్రీవెన్స్ జ‌రిగే రోజున వ‌స్తే బండి సంజ‌య్‌కుమార్‌కి కూడా ఈ విష‌యం అర్థమ‌వుతుంద‌ని అన్నారు. వ‌రంగ‌ల్ సీపీ రంగనాథ్‌పై బండి సంజ‌య్ వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న మంగ‌ళ‌వారం త‌న క్యాంపు కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. త‌న‌కు ఎవ‌రిపైనా త‌ప్పుడు కేసులు బ‌నాయించే ఉద్దేశం లేద‌ని స్పష్టం చేశారు. నేను రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌నిచేస్తాన‌ని అన్నారు. నేను ఎలా ప‌నిచేస్తానో ప్రజ‌లంద‌రికీ తెలుస‌ని అన్నారు. చ‌ట్టం ప‌రిధిలో ప‌నిచేస్తున్నాన‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తుంద‌ని బండి సంజ‌య్‌పై కేసు న‌మోదును ఉద్దేశించి అన్నారు. త‌న‌పై అక్రమ కేసు పెట్టలేద‌ని సీపీ రంగ‌నాథ్ ప్రమాణం చేసి చెప్పాల‌న్న బండి వ్యాఖ్యల‌పైనా స్పందించారు. తాను విధుల్లో చేరే స‌మ‌యంలోనే ప్రమాణం చేశాన‌ని, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, అలా చేయ‌లనుకుంటే తాను ప‌దివేల‌కు పైగా ప్రమాణాలు చేయాల్సి ఉంటుంద‌ని వ్యగ్యంగా స్పందించారు.

బండి సంజయ్ నన్ను టార్గెట్ చేశారు.

కేసులో ముద్దాయిగా ఉన్న వారు పోలీసుల తీరును తప్పుపట్టడం సహ‌జ‌మేన‌ని సీపీ అన్నారు. అరెస్టు చేసిన త‌ర్వాత‌నే త‌న‌పై కొత్తగా బండి సంజ‌య్ ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శన‌మ‌ని అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యలు ఉక్రోషంతో చేసినట్టుగానే తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. కొంత‌మంది నా బాధితులమంటూ బండి సంజ‌య్‌ను సంప్రదించార‌ని తెలుస్తోంద‌ని అన్నారు. అయితే సంప్రదించిన వారిలో ల్యాండ్ మాఫియా, లోఫర్, డాఫర్ చీటర్స్, పీడీ యాక్ట్ బాధితులై ఉంటార‌ని అన్నారు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తే పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తుంటార‌ని స్పష్టం చేశారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపోతాన‌ని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశాను. సెటిల్మెంట్ దందాలు చేసేవారిని క్షమించనని అన్నారు. దళారులు దందాలు చేసేవారు నా వద్దకు రారు. రోజుకు 50 నుంచి 60 గ్రీవెన్స్ చూస్తానని అన్నారు. ఈటలను విచారణకు పిలిస్తే వచ్చి వివరాలు ఇచ్చారు.

పరువు నష్టం కేసును ఆధారాలతో ఎదుర్కొంటా

బండి సంజ‌య్ ప‌రువు న‌ష్టం దావా కేసు వేస్తే స్పష్టమైన ఆధారాల‌తో ఎదుర్కొంటాన‌ని అన్నారు. బండి సంజ‌య్‌పై అనవసరంగా కేసు పెట్టలేదని, మా దగ్గర ఆధారాలతో ముందుకు వెళ్తామ‌ని అన్నారు. ఈ కేసు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందని అన్నారు. తమ విచారణకు ఆటంకం కలిగించినట్లైతే బెయిల్ కండిషన్ ఉల్లంఘించినట్లే అవుతుంద‌ని విలేక‌రులు అడిగినా ఒక ప్రశ్నకు స‌మాధానంగా చెప్పారు. తన ప్రెస్ మీట్‌పై బండి సంజయ్ స్పందించినా ఇక నేను స్పందించనంటూ సీపీ వ్యాఖ్యనించడం గ‌మ‌నార్హం.

Also Read..

ఫూలే జయంతి ఎఫెక్ట్: YS షర్మిలపై సొంత పార్టీ నేతలు సీరియస్

Advertisement

Next Story

Most Viewed