నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం హర్షనీయం : వీఆర్ఓ జేఏసీ

by Bhoopathi Nagaiah |
నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం హర్షనీయం : వీఆర్ఓ జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం పట్ల వీఆర్ఓల జీఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వీఆర్వోల రద్దు సమస్యను వదిలేయకుండా నిరంతర కృషిచేస్తూ ఎన్ని అంతరాయాలు వచ్చినా ఓర్పుతో వీఆర్ఓ జేఏసీ నాయకత్వంలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మినిస్టర్ కోటర్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన జేఏసీ నాయకులు నూతన రెవెన్యూ చట్టం, గ్రామ రెవెన్యూ వ్యవస్థపై చర్చించారు.

గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో శాసనసభలో బిల్లు నెంబర్ 8, వీఆర్వోల రద్దు చట్టం 10 ఆఫ్ 2020 చట్టం తెచ్చి 2022 ఆగస్టున జీవో ఎంఎస్ నెంబర్ 121 ద్వారా ఇతర శాఖలకు బదిలీ చేసిన వీఆర్వోలను యథావిధిగా రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి సంపూర్ణ అమలుకు పాటుపడ్డ వీఆర్వోలను మరల రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని, తద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా రాబోతున్న రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడంలో సులభతరం అవుతుందన్నారు.

రాష్ట్రంలో 10954 రెవెన్యూ గ్రామాలు ఉన్నందున ప్రతి ఒక్క గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని కోరారు. కక్షపూరిత రాజకీయాలతో ఉద్యోగులను బలి చేయకూడదన్నారు. రెవెన్యూ మంత్రిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, జనరల్ సెక్రటరీ హరారే సుధాకర్ రావు, అదనపు జనరల్ సెక్రెటరీ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్ చింతల మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed