తెలంగాణతో మా హక్కులకు విఘాతం.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్

by GSrikanth |   ( Updated:2022-12-14 14:42:15.0  )
తెలంగాణతో మా హక్కులకు విఘాతం.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వమే విభజన సమస్యల పరిష్కారానికి పెద్ద అడ్డంకిగా మారిందని, ఎనిమిదేళ్ళు దాటినా అనేకం పెండింగ్‌లోనే ఉండిపోయాని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ నివేదించింది. ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలోని సంస్థల విభజన ఎటూ తేలకుండా ఉండిపోయిందని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకు విఘాతం కలుగుతున్నదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు వ్యతిరేకమని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ తరఫున న్యాయవాది మహఫూజ్ నజ్కీ పేర్కొన్నారు. సుమారు రూ. 1.42 లక్షల కోట్ల మేర ఆస్తులు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ కాకుండా ఉండిపోయాయని పేర్కొన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న విధానం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులకు ఆటంకంగా పరిణమించిందని, జోక్యం చేసుకుని వెంటనే విభజన సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు దాటినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల పంపిణీ ప్రక్రియ కొలిక్కి రాలేదన్నారు. తొమ్మిదవ షెడ్యూలులో ఉన్న 91 సంస్థలు, పదవ షెడ్యూలులో ఉన్న 142 స,సథల ఆస్తుల విభజనతో పాటు ఈ రెండింటిలో పేర్కొనకుండా ఉండిపోయిన మరో 12 సంస్థలకు చెందిన సుమారు రూ. 1,42,601 కోట్ల ఆస్తుల పంపిణీ గాల్లో వేలాడుతున్నదన్నారు. ఈ సంస్థలకు చెందిన ఆస్తుల్లో సుమారు 91% హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్నారు. తొమ్మిదవ షెడ్యూలులోని సంస్థల ఆస్తులు మొత్తం రూ. 24,018.53 కోట్లలో దాదాపురూ. 22,556.45 (93.9%), పదవ షెడ్యూలులోని సంస్థలకు చెందిన రూ. 34,642.77 కోట్లలో రూ. 30,530.86 కోట్లు (88%) తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. ఇక ఈ రెండు షెడ్యూళ్ళకు బైట ఉన్న 12 స,స్థలకు చెందిన రూ. 1,759 కోట్ల ఆస్తులు కూడా ఆ రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తుచేశారు.

దీర్ఘకాలంగా ఈ సంస్థల విభజన, వాటికి చెందిన ఆస్తుల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఏపీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నదని, అది ప్రజలపై కూడా ప్రభావం చూపిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల రాజ్యాంగ హక్కులకు సైతం విఘాతం కలిగిందన్నారు. ఈ రెండు షెడ్యూళ్ళలోని సంస్తలకు చెందిన సుమారు 1.59 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పటికీ విభజన ప్రక్రియపై అనేక రకాల అసంతృప్తి ఉన్నదన్నారు. ఎనిమిదేళ్ళ కాలంలో రిటైర్ అయిన ఉద్యోగుల పింఛను తదితర సెటిల్‌మెంట్ల విషయంలోనూ ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆ సంస్థల నిర్వహణ గందరగోళంలో పడిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా పరిష్కారం జరిగేలా తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు జారీచేయాలని ఆ పిటిషన్‌లో ఏపీ తరపున మహఫూజ్ నాజ్‌కీ కోరారు.

Advertisement

Next Story