కొత్త క్రిమినల్ చట్టాలతో ప్రాథమిక హక్కులకు విఘాతం: వినోద్ కుమార్

by Satheesh |
కొత్త క్రిమినల్ చట్టాలతో ప్రాథమిక హక్కులకు విఘాతం: వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1 నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువస్తుందని, మార్పు అంటే మంచి జరగడం కానీ విఘాతం కలుగకూడదన్నారు.

2023 ఆగస్టులో చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిందని, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక సూచనలు చేశారన్నారు. కానీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి, న్యాయ శాఖ మంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు. చట్టాలను ఇంగ్లీష్ లో ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలో ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్‌కు భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే పేరు పెట్టారని తెలిపారు. కొత్త చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టారన్నారు. కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లు ఆందోళన చేయవద్దని అన్ని బార్ అసోసియేషన్స్‌కు లేఖలు రాశారన్నారు. మోడీ తెచ్చిన నల్ల చట్టాలతో రైతులు చనిపోయారని, చట్టాల మార్పులను వాయిదా వేయాలని మోడీని డిమాండ్ చేశారు.

ఎఫ్.ఐ.ఆర్‌ను రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు. స్టేషన్ బెయిల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారని, బాధితుడు హింసకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుందన్నారు. కొత్త చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయని, చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని, ఇప్పుడు కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని ఉందన్నారు. కొత్త చట్టాల వలన భాదితుడికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చారని, బార్ కౌన్సిల్‌ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలపై సుప్రీం కోర్టు జోక్యం చేకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో సోమ భరత్ కుమార్, లలితా రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed