అన్ని ఆలయాలకూ విజయ నెయ్యి : ప్రభుత్వ ఆదేశాలు

by M.Rajitha |
అన్ని ఆలయాలకూ విజయ నెయ్యి : ప్రభుత్వ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకూ విజయ బ్రాండ్ నెయ్యిని సరఫరా చేయాల్సిందిగా డెయిరీ యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తుల అవసరాల కోసం పాల ఉత్పత్తులనూ సరఫరా చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం డెయిరీ వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించిన ప్రభుత్వం మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే తొలుత తెలంగాణ పరిధిలోని ఆలయాలన్నింటికీ నెయ్యిని సరఫరా చేసేలా మెకానిజంను రెడీ చేసింది ప్రభుత్వం. చొరవ తీసుకున్న డెయిరీ యాజమాన్యం తన వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి ఆలయానికి సైతం నెయ్యిని, పాల ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. మరోవైపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్ళు, సర్కారు దవఖానలు, జైళ్ళు.. ఇలాంటి పలు వ్యవస్థలకూ విజయ డెయిరీ నుంచి పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేసేలా ప్రభుత్వం సహకారం అందించింది.

దీంతో విజయ డెయిరి వార్షిక టర్నోవర్ పెరగడంతో పాటు రైతుల నుంచి తీసుకునే పాల సేకరణ, ప్యాకెట్ల విక్రయాలు, నెయ్యి తదితర పాల ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు పెరగనున్నాయి. ఈ అవసరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా విజయ డెయిరీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోనున్నది. విజయ డెయిరీలో ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి సామర్థ్యంతో పాలను, పాల ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రైతాంగం ఉత్పత్తి చేసే పాలను వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో డెయిరీ ఈ ప్లాన్ చేస్తున్నదని వివరించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను కూడా త్వరలో చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగంలో పనిచేసే సంస్థగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారుడికి సరసమైన ధరలో నాణ్యమైన పాలను, ఉత్పత్తులను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పాల కొరత ఉన్న టైమ్‌లో 2022, 2023 సంవత్సరాల్లో మూడుసార్లు ఒక్కో లీటర్‌ పాలకు సగటున రూ. 12.48 చొప్పున సేకరణ ధరను పెంచామని, రైతులకు లబ్ధి చేకూరిందని, ఫలితంగా పాల విక్రయాలు పెరిగాయని చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు. కొన్ని సహకార డెయిరీలు, ప్రైవేటు డెయిరీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని (కర్ణాటక, మహారాష్ట్ర) సహకార డెయిరీలు కూడా తక్కువ ధరకే పాలను విక్రయిస్తున్నాయిని (లీటర్ రూ. 34 లోపే), ఆవు పాలను సేకరించడం ద్వారా ఇది సాధ్యమైందని, ఫలితంగా వారి వ్యాపారం పెరిగిందని వివరించారు. హైదరాబాద్ సిటీకి కూడా నిత్యం నెల్లూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి పాలు వస్తున్నాయని, వీటిని ప్రైవేటు డెయిరీలు విజయ పేరుతో విక్రయిస్తున్నాయని, ‘సిబ్లింగ్ బ్రాండ్’ అని సమర్ధించుకోవడం ద్వారా తెలంగాణకు చెందిన విజయ పాల విక్రయాలు తగ్గాయని వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... ప్రభుత్వ విభాగాలకు సరఫరాను పెంచేందుకు వెసులుబాటు కలిగించారని, అందులో భాగమే స్కూళ్ళు, హాస్టళ్లు, ఆస్పత్రులు, జైళ్ళు, ప్రభుత్వ ఆఫీసులకు సరఫరా చేసేందుకు విడుదలైన ఆదేశాలు అని చైర్మన్ వివరించారు.

Next Story

Most Viewed