‘గాంధీ’లో పిల్లల మరణాలపై రాజకీయ దుమారం

by karthikeya |
‘గాంధీ’లో పిల్లల మరణాలపై రాజకీయ దుమారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాస్పత్రులపై రాజకీయాలు చేస్తుండడం పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నది. ఆయా ఆస్పత్రుల ప్రతిష్ఠ సైతం దెబ్బతింటున్నది. దీంతో చాలా మంది ఆయా ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు జంకుతుండగా.. పేదోడికి వైద్యం అందడం కష్టంగా మారుతున్నది. అంతేగాక సర్కారీ దవాఖాన్ల డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ కూడా రాజకీయ పార్టీల విమర్శలకు బలి అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా గాంధీ హాస్పిటల్ పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఒకే నెలలో 48 మంది చనిపోయారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనికి హెల్త్ మినిస్టర్ నుంచి ఆఫీసర్ల వరకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు రోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని, లేదంటే గవర్నమెంట్ ఆస్పత్రులంటే పేదోళ్లు భయపడాల్సి వస్తుందని, దీంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తాయని పేర్కొంటున్నారు.

మరణాల్లోనూ రాజకీయమా!

ప్రభుత్వ దవాఖాన్లలో పరిస్థితి విషమించి రోగులు మరణించిన అంశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు వాడుకుంటున్నారని గవర్నమెంట్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులకు అత్యంత క్రిటికల్ కేసులే వస్తుంటాయని, ఇలాంటి సమయంలో తామెంత ప్రయత్నించినా డెత్స్ జరుగుతుంటాయని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం పవర్ లో ఉన్నా, వీటిని అడ్డుకోవడం కష్టమేనని వివరిస్తున్నారు. కొంత మంది ప్రైవేట్, కార్పొరేట్ నుంచి చివరి నిమిషంలో వచ్చి ప్రభుత్వాస్పత్రుల్లో మరణిస్తుంటారని, వీటిలోనూ రాజకీయ పార్టీలు తమ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరించడం సబబు కాదని మండిపడుతున్నారు. అంతేగాక రాజకీయ పార్టీల ప్రోద్బలంతో హాస్పిటళ్ల ఎదుట ధర్నాలు చేసి డాక్టర్లు, పేషెంట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని ఓ డాక్టర్ తెలిపారు.

గాంధీపై ‘ఎక్స్’ వేదికగా విమర్శలు

గాంధీ హాస్పిటల్‌లో ఆగస్ట్ నెలలో 48 మాతా, శిశు మరణాలు జరిగాయని బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెద్ద దుమారం లేపడంతో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజ కుమారి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి స్పందించారు. గాంధీ హాస్పిటల్‌లో గత కొన్నేండ్లుగా నెలకు సగటున 40కి పైనే మాతా, శిశు మరణాలు జరుగుతున్నాయని, ఆధారాలతో సహా అన్ని వివరాలను బయటపెట్టారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ప్రతి నెలా జరిగిన మెటర్నల్ డెత్స్‌, శిశు మరణాలు, పీడియాట్రిక్ డెత్స్‌ వివరాలను వెల్లడించారు. గాంధీ హాస్పిటల్‌కు అత్యంత సీరియస్ కండీషన్‌లో ఉన్న పేషెంట్లు వస్తారని, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు పేషెంట్‌ కండీషన్‌ పూర్తిగా విషమించిన తర్వాత గాంధీకి పంపిస్తారని క్లారిటీ ఇచ్చారు.

హెల్త్ మినిస్టర్ కూడా ఇదే అంశంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చేందుకే గాంధీ హాస్పిటల్‌పై కేటీఆర్ బురద జల్లుతున్నాడని మంత్రి విమర్శించారు. పదేండ్ల బీఆర్‌‌ఎస్ పాలనలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ స్థాయిలో ఎదిగాయో అందరికీ తెలుసునని మంత్రి ట్వీట్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడినందుకే తాటికొండ రాజయ్యను గతంలో కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తాటికొండ రాజయ్యను గాంధీ హాస్పిటల్‌కు పంపిస్తున్నారని, ఆయన గతంలో చేసిన అవినీతిని అధ్యయనం చేయడానికి కమిటీ వేశారా అని కాంగ్రెస్ నేతలు దుయ్యపట్టారు. అయితే కరోనా సమయంలోనూ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి విమర్శలే చేశారని, ఇప్పుడు తాము చేస్తే డ్యామేజ్ అవుతుందా? అంటూ కొందరు బీఆర్ ఎస్ నేతలు చెప్పడం గమనార్హం.

Next Story

Most Viewed