30 ఏళ్లు గడుస్తున్నా రూ.20 వేలే..!

by karthikeya |
30 ఏళ్లు గడుస్తున్నా రూ.20 వేలే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో సంవత్సరాల నుంచి పని చేసే కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అరిగోస పడుతున్నారు. ఎందరినో ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, సైంటిస్టులుగా, ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీర్చిదిద్దిన వీరు సరిపడా వేతనం రాక అర్ధాకలితో ఆపసోపాలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఏర్పాటైంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఓయూలో కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేసే వీరు నేటి వరకూ రెగ్యులరైజేషన్‌కు నోచలేదు. 30 ఏండ్ల సినియారిటీ ఉన్నా ప్రస్తుతం తమకు ప్రతి నెలా రూ.20 వేల లోపే వేతనం ఇస్తున్నారని, ఫలితంగా కుటుంబ పోషణ భారమై అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులరైజేషన్‌కు నోచని 1600 మంది

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1600 మందికి పైగా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే 1,150 మంది సిబ్బంది వర్క్ చేస్తున్నారు. సుమారు 30 ఏండ్లుగా చాలీచాలని వేతనంతో పని చేస్తున్న వీరు ఏదో ఒక రోజు తమనూ రెగ్యులరైజేషన్ చేస్తారని, వేతనాలు పెంచుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అసలు కాంట్రాక్ట్ విధానమే లేకుండా చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని వారు మండిపడుతున్నారు.

సినియారిటీ వృథా అవుతుందనే భయం

తక్కువ వేతనంతో పని చేయలేక, కొత్త ఉద్యోగంలోకి వెళ్లలేక కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మదన పడుతున్నారు. ఒక వేళ మరో ఉద్యోగంలోకి వెళ్తే ఇప్పటి వరకు చేసిన సీనియారిటీ వృథా అవుతుందని భయ పడుతున్నారు. తక్కువ వేతనంతో నగరంలో ఖర్చులు భరించలేక వారు సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసింది. పిల్లలను చదివించాలన్నా.. ఏదైనా ఆపద ఎదురైనా, ఇంట్లో పెద్దలకు వైద్య పరీక్షలు చేయించాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమలు కాని పీఆర్‌సీ

అన్ని ప్రభుత్వ రంగ శాఖల్లో పీఆర్‌సీ అమలవుతుండగా ఓయూ వర్సిటీలో మాత్రం కావడం లేదని వారు చెబుతున్నారు. పీఆర్‌సీ కోసం 2012 నుంచి అమలు చేశారని, కానీ రూ.10 వేల లోపు జీతం ఉన్న వారికి 15 శాతం, ఆపైన ఉన్న వారికి ఏడాదికి రూ.1500 ఇస్తామని అప్పటి వీసీ ప్రకటించారని గుర్తు చేశారు. అయితే గత వీసీ రవీందర్‌ను పీఆర్‌సీ గురించి అడిగితే గతంలో ఉన్న విధానాన్ని తొలగించి అందరికీ రూ.3వేలు పెంపుదల చేస్తామని చెప్పారని వారు పేర్కొన్నారు. ఇలా పాత విధానాన్ని రద్దు చేయడంతో పాటు జూన్ 2022 నుంచి ఆ ప్రక్రియను మొత్తానికే

నిలిపి వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు రావాల్సిన ఇంక్రిమెంట్ సైతం కట్ అయిందని బోధనేతర సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశంపై ఇటీవల వచ్చిన ఇన్‌చార్జి వీసీ దాన కిశోర్‌కు వివరించగా కమిటీ వేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అయితే వర్సిటీ అధికారులు మాత్రం తమ తప్పు ఎక్కడ బయటపడుతుందనే భయంతో కమిటీ వేయడం లేదని చెబుతున్నారు.

ఖాళీ చేతులతోనే రిటైర్‌మెంట్

రెగ్యులరైజ్ అవుతుందని భావించి ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నా. మరో రెండేండ్లలో రిటైర్ అవుతా. ఇప్పటికే ఎంతో మంది ఖాళీ చేతులతోనే, ఎలాంటి భరోసా లేకుండానే రిటైర్ అయ్యారు. నేను ఖాళీ చేతులతో పోవాల్సి వస్తుందేమో. ఉద్యోగ విరమణ తర్వాత ఎలా బతికేది. ఈఎస్ఐ సైతం అమలు చేయడం లేదు. పీఎఫ్ కూడా కోర్టును ఆశ్రయిస్తే గతేడాది నుంచి ఇస్తున్నారు. - సూర్య చందర్, తెలంగాణ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్

వర్సిటీలో 2 వేలకు పైగా ఖాళీలు

ఉస్మానియా వర్సిటీలో 2 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మమ్మల్ని ఆ పోస్టుల్లో రిక్రూట్ చేసినా చాలా పోస్టులు మిగులుతాయి. 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారూ ఉన్నారు. దాదాపుగా అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. తక్కువ జీతంతో పని చేస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. వీసీ రవీందర్ మమ్మల్ని మోసం చేశారు. బీఆర్ఎస్ సైతం రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి. - ఎడ్ల అంజయ్య, తెలంగాణ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్

అమలు కాని 61 ఏండ్ల రిటైర్మెంట్ విధానం

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 61 ఏండ్లకు రిటైర్మెంట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక్క ఓయూలో మాత్రమే అమలు చేయడం లేదు. 60 ఏండ్లకే రిటైర్‌మెంట్ ఇస్తున్నారు. దీనివల్ల ఏడాది నష్టపోతున్నాం. వచ్చేదే తక్కువ జీతం.. అందులోనూ ఈ నష్టం. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించాం. అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయట్లేదు. వేతనం ఇవ్వట్లేదు. యూనివర్సిటీ అధికారులు కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారు. - డాక్టర్ కే వీరేశం, టెక్నికల్ అసిస్టెంట్

Next Story

Most Viewed