బీజేపీ, జనసేన పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
బీజేపీ, జనసేన పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పాలిటిక్స్‌లోనూ జనసేన యాక్టివ్‌గా పని చేస్తోందని.. ఇక్కడ కూడా ఏపీలో మాదిరిగానే బీజేపీతో కలిసి నడుస్తామని పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేయడంపై వాళ్ల వైఖరి ఏంటో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని.. కానీ దీనిపై ఇప్పుడే తాము నిర్ణయం తీసుకోలేమని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, కార్యకర్తలతో చర్చించి తర్వాత జనసేనతో కలిసి పని చేయడంపై నిర్ణయం తీసుకుంటామని బండి స్పష్టం చేశారు.

అంతేకానీ హైకమాండ్‌తో చర్చించకుండా పొత్తులపై ఎవరికీ వారు నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పని చేయడం, పొత్తు వ్యవహారంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వెల్లడించారు. కాగా, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ 8 సీట్లు కేటాయించగా.. పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఈ ప్రభావంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించింది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై బండి, పవన్ చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed