ఆర్థిక వ్యవస్థ మీద జోకులొద్దు.. కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ సీరియస్

by GSrikanth |   ( Updated:2023-02-16 14:04:56.0  )
ఆర్థిక వ్యవస్థ మీద జోకులొద్దు.. కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోకులు వేయడం మానుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చురకలంటించారు. ఆయన ఈ అంశంపై మాట్లాడొద్దని చేతులు జోడించి సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఉపాధిహామీకి కేటాయించిన మొత్తం కంటే ఎక్కువగానే ఖర్చుచేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో అసలు అభివృద్ధే జరగట్లేదు.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే అద్భుతంగా జరుగుతుందని చెప్పడంపై విరుచుకుపడ్డారు. తమ పథకం అని గొప్పలు చెప్పుకునే వారి కన్నా మోడీ ప్రభుత్వం ఎక్కువగానే ఖర్చుపెట్టిందని తెలిపారు.

2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు స్థాపించినట్లు ఈ బడ్జెట్‌లో చెప్పానని, ఆ కళాశాలల వద్ద నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు రాలేదని ఇప్పుడు బాధపడితే ఏంటి లాభమని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తాము తెలంగాణలో ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల పేర్లు పంపించాలని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేశారు. జిల్లాల పేర్లను అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ప్రయోజనమేంటని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ఉన్నచోటనే నర్సింగ్ కాలేజీలు పెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో? ఎక్కడ లేవో అనే విషయం తెలంగాణ ప్రభుత్వం వద్దే లేదని, అందుకే ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. నో డేటా గవర్నమెంట్ ఎవరిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఆమె చురకలంటించారు.

కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలున్నాయని, తిరిగి అవే జిల్లాల పేర్లను మెడికల్ కాలేజీల కోసం పంపించడమేంటని ఆమె ప్రశ్నించారు. దీన్ని తాము తిరస్కరించామని, అయినా కొత్త జిల్లాల పేర్లను ఇప్పటికీ పంపించలేదని ఆమె మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కార్‌కు లక్షా 39 వేల కోట్లు గ్రాంట్స్ రూపంలో వచ్చాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ బడ్జెట్లో రూ.4400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2022- 23 సంవత్సరానికి గాను రూ.3048 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు ఎలా వెళ్లిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read...

సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

Advertisement

Next Story