పోలవరం ఆగిపోవడానికి కేసీఆరే కారణం: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-02-18 13:17:10.0  )
పోలవరం ఆగిపోవడానికి కేసీఆరే కారణం: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై ఏపీ సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలంటే ముందు ఏపీలోని విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని అన్నారు. కేసీఆర్ చెబుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో సపోర్ట్ రావాలన్న, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఆయన తిట్టిన తిట్లు మర్చిపోవాలన్నా విభజన సమస్యలు సెటిల్ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌కు నేషనల్ లీడర్ అయ్యేందుకు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఏపీ ప్రజలకు న్యాయం చేయకపోతే ఇదే అతడికి పెద్ద మైనస్ అవుతుందని అన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రతో తేల్చుకోలేని వాడు మాకేం చెబుతాడనే తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉందన్నారు. దేశంలో వేల టీఎంసీలు సముద్రం పాలవుతోందని కేసీఆర్ చెబుతున్నారు. కానీ పోలవరంలో 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతోందని ముందు దాన్ని సెటిల్ చేయాలని అన్నారు. పోలవరం ఆగిపోవడానికి సీఎం కేసీఆరే కారణం అన్నారు. పోలవరం విషయంలో మీరు చేసినట్లుగానే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో గొడవలు ఉన్నాయని ఈ విషయంపై మాట్లాడే ముందు కేసీఆర్ పోలవరం నిర్మాణానికి సహకరించాలని కోరారు.

చట్ట ప్రకారం రావాల్సిన హైదరాబాద్ లోని ఆస్తులను ఏపీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాలను ఏపీతో ప్రారంభించాలని, ఏపీకి తెలంగాణకు ఉన్న విభేదాలను పరిష్కరించడం ద్వారా మొదలు పెట్టాలని సూచించారు. రాష్ట్ర విభజనతో కష్టం ఏపీ ప్రజలకు వస్తే సుఖం మాత్రం తెలంగాణ ప్రజలకు అందిందన్నారు.

ఉండవల్లి వ్యాఖ్యలపై వెనుక కారణం ఇదేనా?

ఇదిలా ఉంటే ఇన్నాళ్లు కేసీఆర్‌ను ఆకాశానికెత్తిన ఉండవల్లి అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గతంలో జాతీయ రాజకీయాలపై ఆలోచనలు చేస్తున్న తరుణంలో గతేడాది జూన్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రగతి భవన్‌కు వచ్చిన ఉండవల్లి సుమారు 3 గంటల పాటు కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి రమ్మంటేనే తాను వెళ్లానని, తమ మధ్య పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు.

తన అభిప్రాయాలను కేసీఆర్ చెప్పారని అన్నారు. బీజేపీ విధానాలపై పోరాటానికి కేసీఆర్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారని కితాబిచ్చారు. ఈ భేటీ తర్వాత ఉండవల్లికి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అనౌన్స్ చేయడం ఏపీ శాఖకు అనూహ్యంగా తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ప్రకటించం కీలక పరిణామంగా మారింది. తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఏపీలో బీఆర్ఎస్ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు వినిపించకుండా పోయింది.

అయితే తనతో చర్చలు జరిపిన కేసీఆర్ తనను కాదని మరొకరికి ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించడం వల్లే ఉండవల్లి తాజాగా కేసీఆర్ ను టార్గెట్ చేశారా అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఉండవల్లి వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమైనప్పటికీ విభజన చట్టం ప్రకారం ఏపీకి సహకరించకుంటే కేసీఆర్ కు పెద్ద మైనస్ అవుతుందన్న వ్యాఖ్యలు పొలిటికల్ వైజ్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి.

Also Read...

లక్షల కోట్లు ఏమయ్యాయి..? CM కేసీఆర్‌పై రఘునందన్ రావ్ ఫైర్

Advertisement

Next Story