టీఎస్‌పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలి: గవర్నర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

by Satheesh |
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించాలని గవర్నర్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం టీ కాంగ్రెస్​నేతలు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్​పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి, విచారించాలన్నారు.

పేపర్ లీక్‌లో జరిగిన అవతవకలపై ఎంక్వైరీ చేయాలని కోరారు. కేటీఆర్ శాఖకు సంబంధించిన ఉద్యోగులే పేపర్ లీక్‌లో కీలకంగా వ్యవహరించారని, ఇందుకు ఆ శాఖ మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్‌ను దొంగిలించి కోట్లకు అమ్ముకుని లక్షలాది మంది నోరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ పీఏ పైన కూడా ఆరోపణలు వస్తున్నట్టు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్‌కు విశేష అధికారాలున్నాయని, వాటి ప్రకారం ఇప్పుడున్న బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుందని రేవంత్ చెప్పారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, పారదర్శక విచారణకు గవర్నర్‌ను అనుమతి కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది లక్షలాది విద్యార్థులు కాదు.. లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య అని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని, కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టామన్నారు.

గతంలో వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు గవర్నర్ తనకున్న విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరామన్నారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ తెలిపారు.

ఉగాది వేడుకల్లో పాల్గొన్న రేవంత్..

శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి చిలుకూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబదుతుందన్నారు రేవంత్. రాహుల్ గాంధీ పాదయాత్ర సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ప్రజలకు నచ్చేలా పనిచేస్తే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తారన్నారు.

Advertisement

Next Story