TSPSC పేపర్ లీక్ కేసు.. సిట్ vs ఈడీ

by Mahesh |
TSPSC పేపర్ లీక్ కేసు.. సిట్ vs ఈడీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల చోరీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. విచారణకు సిట్ సహకరించటం లేదని ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ఆ అవసరం లేదంటూ సిట్ కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణను దాదాపుగా ముగింపు దశకు తెచ్చిన సిట్ అధికారులు ఇటీవల సీల్డ్ కవర్‌లో హై కోర్టుకు నివేదికను కూడా సమర్పించారు. కాగా, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 48, 49 ప్రకారం విచారణ జరిపే అర్హత తమకు ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే బోర్డు ఉద్యోగులు సత్యనారాయణ, శంకర్ లక్ష్మికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే, బుధవారం రావాల్సి ఉన్నా శంకర్ లక్ష్మి ఈడీ విచారణకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈడీ గురువారం సిట్ అధికారులు తమకు సహకరించటం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తునకు సహకరించేలా సిట్‌కు ఆదేశాలు జారీ చెయ్యాలని కోరారు. దీనిపై సిట్ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణ హై కోర్టులో జరుగుతోందని తెలిపారు. సీల్డ్ కవర్‌లో ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను హై కోర్టుకు సమర్పించామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈడీకి తాము సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed