ఈటలపై వేటుకు ప్లాన్? అసెంబ్లీ మొదలుకాగానే సస్పెన్షన్?

by Rajesh |   ( Updated:2022-09-12 03:38:46.0  )
ఈటలపై వేటుకు ప్లాన్? అసెంబ్లీ మొదలుకాగానే సస్పెన్షన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెన్షన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పీకర్ ను మరమనిషి అనే కామెంట్ పై వేటుకు అధికార టీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే సంకేతం ఇచ్చింది. నోటీసులు సైతం ఇస్తామని ఈ నెల 7న లీకులు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై పలు చర్చలకు దారితీస్తోంది. అయితే నేడు అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుండటంతో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యేల నోరునొక్కడంలో భాగంగానే అధికారపార్టీ 'మరమనిషి' అనే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని సస్పెన్షన్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకరిపై కాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు అనివార్యంగా మారిందనే ప్రచారం ఊపందుకుంది.

టీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్న సమయంలోనే భూకబ్జాల ఆరోపణలు రావడంతో ఈటల సస్పెండ్ కు గురయ్యారు. బీజేపీలో చేరి బైపోల్ లో పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీకి వెళ్లిన మొదటిరోజునే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటలతో పాటు రాజాసింగ్, రఘునందన్ రావు లు సస్పెన్షన్ కు గురయ్యారు. రెండవశాసనసభ 8వ సెషన్ రెండవ సమావేశం మొత్తానికి సస్పెన్షన్ చేసింది. తిరిగి ఈ నెల 6న 8వ సెషన్ మూడవ సభ మొదలైన 6 నిమిషాలకే వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే బీజేపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించకపోవడంతో మీడియా గ్యాలరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల హాట్ కామెంట్ చేశాడు. స్పీకర్ ను మరమనిషి అని పేర్కొనడంతో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.

బేషరతుగా ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నెల 7న ఈటలకు, రఘునందన్ రావుకు నోటీసులు ఇస్తామని ఫోన్ చేసినట్లు ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరమనిషి అనే పదం అసెంబ్లీలో నిషేధించారా? ఏయే పదాలు నిషేధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ను మరమనిషి అనడంలో తప్పేమీ లేదని మీడియాకు తెలిపారు. టీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని, బీజేపీ చెప్పబోమని బీష్మించాయి. ఈ నేపథ్యంలో తిరిగి సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ ను మరమనిషి అని వ్యాఖ్యానించిన ఈటలపై చర్యలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టనున్నట్లు సమాచారం. ఈటల వ్యాఖ్యలు సభను, స్పీకర్ ను అవమానపరిచే విధంగా ఉన్నాయని పేర్కొంటూ సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరనున్నట్లు తెలిసింది. ఒకవేళ సభ జరిగితే బీజేపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం తక్కువ ఇవ్వనున్నట్లు తెలిసింది. వారు సమస్యలపై మాట్లాడకుండా నోరు నొక్కే ప్లాన్ ను అధికార పక్షం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీకి ఎక్కువ సమయం ఇస్తే ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అంశం తప్ప ఏ ఒక్క అంశం నుంచి బయటకు వెళ్లినా మైక్ కట్ చేసే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేయనున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలపైనా వేటు అనివార్యం?

ప్రస్తుతం బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇద్దరికి కూడా అన్ని అంశాలపై పట్టు ఉంది. ఈటలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండగా, మరొకరికి న్యాయవాద వృత్తిలో మంచి నైపుణ్యం ఉంది. ఇద్దరూ కూడా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తే అవకాశం ఉంది. మొదటి రోజున అసెంబ్లీని సంతాప తీర్మానాలతోనే ముగించడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పై మరమనిషి అని కామెంట్ చేయడంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య అగ్గిరాజేసినట్లయింది. దీంతో క్షమాపణకు టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ససేమీరా అనడంతో ఇద్దరిపై సభా నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఏం జరుగుతుందోనని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలో చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనప్పటికీ నేడు ఆచర్చకు పుల్ స్టాప్ పడనుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభమైన వెంటనే జరిగేది ఇదే!

Advertisement

Next Story