ట్రాఫిక్ డ్యూటీల్లో ట్రాన్స్‌జెండర్లు.. తెలంగాణ సర్కార్ సరికొత్త డెసిషన్

by karthikeya |
ట్రాఫిక్ డ్యూటీల్లో ట్రాన్స్‌జెండర్లు.. తెలంగాణ సర్కార్ సరికొత్త డెసిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్‌గా గుర్తించాలని 2014లో ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పాలసీ డెసిషన్ తీసుకున్నది. దానికి కొనసాగింపుగా అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ వ్యవస్థలన్నీ వారిని గుర్తించడంతో పాటు ఆడ, మగ లాగానే వారూ వివక్షకు తావు లేకుండా జీవించాలనే ఉద్దేశంతో రూపొందినవని ఆయా ప్రభుత్వాలు పేర్కొన్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వం సైతం ట్రాన్స్‌జెండర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుత సర్కారు మాత్రం ఓ అడుగు ముందుకేసి వారికి ఓ వైపు ఉపాధి కల్పించడంతో పాటు సమాజంలో బాధ్యతలను అప్పజెప్పేలా నిర్ణయం తీసుకున్నది. దేశంలోని పలు మెట్రో నగరాలతో పోలిస్తే ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నా ట్రాన్స్‌‌జెండర్లను వాలంటీర్లుగా నియమించి వారితోనే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

తమిళనాడులో పోలీసు శాఖలో..

తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్న టైంలో అక్కడి పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్లను రిక్రూట్‌ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. పలువురిని సబ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు. ఇందుకోసం ఫిజికల్ ఫిట్‌నెస్, ఎంపిక ప్రక్రియకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం 2017లో పాలసీ తీసుకురాగా 2022లో కేరళ ప్రభుత్వం సైతం ట్రాన్స్‌జెండర్లను పోలీసు శాఖలో రిక్రూట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. వారికి శారీరక ధారుడ్య పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటికే చత్తీస్‌గఢ్‌లో 13 మంది ట్రాన్స్‌జెండర్లు పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. కర్ణాటక ప్రభుత్వం సైతం ఇదే తరహాలో నియామకాలు చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం సైతం..

తెలంగాణ ప్రభుత్వం సైతం ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ నియంత్రణలో హోంగార్డుల తరహాలో వలంటీర్లుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నది. మూడు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించేలా సీఎం రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్న మాటలు వినిపించాయి. ట్రాన్స్‌జెండర్లను ప్రభుత్వం గుర్తించడం, వారికి ఉపాధి కల్పించడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే పనులు అప్పగించడం ద్వారా సామాజిక బాధ్యతను వారి చేత గుర్తింపజేయడం అని పలువురు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed