అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

by Javid Pasha |   ( Updated:2023-06-22 14:23:51.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు.అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచారని, ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నదని వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ అమరుల త్యాగాలను కేసీఆర్ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో1,569 మంది అమరులు కాగా..కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.స్థూపం పై అమరు వీరుల పేర్లను ఏర్పాటు చేయకుండా వాళ్ల బలిదానాలను కేసీఆర్ అవమానిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

17 జూన్​2017 న అమర వీరుల స్థూపం నిర్మాణానికి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని,డిజైన్,అంచనాలు, పనులు పరిశీలించడానికి 6 శాతం ఫీజు చెల్లించాలనిపేర్కొందన్నారు.28 జూన్​2018న నిర్మాణం కోసం రూ. 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 వ్యయంతో టెండరు ప్రకటన ఇవ్వగా.. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకున్నదన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్ తో కలిశాక కేపీసీ ప్రాజెక్స్ట్ లిమిటెడ్ గా మారిందన్నారు. ఈ కంపెనీ ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన వారిదని, కేపీసీ కంపెనీ అడ్రెస్ విజయవాడకు మార్చుకున్నట్లు వెల్లడించారు. తేలుకుంట్ల శ్రీధర్ కేటీఆర్ కు అత్యంత స్నేహితుడని, కేపీసీ ప్రాజెక్స్ట అనిల్ కుమార్ కామిశెట్టి తో వ్యూహాత్మకంగా తేలుకుంట్ల శ్రీధర్ ,కేటీఆర్ ల కు మేలు జరిగేలా చేశారన్నారు. దీంతో నిర్మాణ అంచనా వ్యయం రూ. 127 కోట్ల 50 లక్షలకు పెరిగిందన్నారు. అయినా సరిపోదని మళ్లీ రూ.158.85 కోట్లకు, తర్వాత రూ.179 కోట్ల 5 లక్షలకు అంచనా వ్యయం పెంచారన్నారు.

ఇంత ఖర్చు పెట్టిన ఏర్పాటు చేసిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాసి సరిపెట్టడం సరికాదన్నారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలోని శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలి ?అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలి. ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య... వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలి. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారు. చరిత్ర పుటల్లో నిలవాల్సిన స్థూపం నిర్మాణాన్ని ఆంధ్రా వాళ్లకు అప్పగిస్తారా? ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా? ఇది బరితెగింపు కాదా? దేవాలయం, మసీదు, చర్చి ఎంత పవిత్రమైనవో అమరుల స్మారకం అంత పవిత్రమైంది. పది ఎకరాల్లో నిర్మించిన ప్రగతి భవన్ పనులను తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే.... అమరవీరుల స్థూపాన్ని నిర్మించడానికి తొమ్మిదేళ్లు పడుతుందా...?” అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యతలోనూ లోపమే..!

“అమరవీరుల స్థూప నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా నాణ్యత పాటించలేదు. నిజంగా అమరవీరులంటే గౌరవం ఉంటే ఇలా చేసేవారా?. ఎలివేషన్ లో తొలుత 10 ఎమ్​ఎమ్​స్టీల్​అని చెప్పి..ఆ తర్వాత స్టెయిన్ లెస్ స్టీల్ .4ఎంఎం తో తయారు చేశారు. దీంతో షీట్ కు షీట్ కు మధ్య గ్యాప్ లు ఉన్నాయి. అడవుల్లో సామాన్యులు కట్టిన స్థూపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. నగరం నడిబొడ్డున అమరుల స్మారకంలో వాడిన స్టెయిన్ లెస్ స్టీల్ 8 ఎంఎం ఉపయోగిస్తామని అంచనా వేసి 4 ఎంఎం వాడారు. దీంతో స్థూపం దగ్గరికి వెళ్తే సొట్టలు, స్టీల్ షీట్లను జాయింట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ అవినీతికి కారణం కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్. తమ దోపిడీకి అమరుల స్మారకాన్ని కూడా వాడుకున్నారు” అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

500 మందికే సాయమా..?

“మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు అని తాము ఎక్కడ చెప్పలేదని, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేయడం విచిత్రంగా ఉన్నదని రేవంత్ చెప్పారు.14 జూన్ 2014న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారనీ, తొలి, మలి ఉద్యమాల్లో 1560 మంది అమరులయ్యారని కేసీఆర్ నిండు సభలో చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు.ఆ తీర్మానాన్ని కూడా కాదని మంత్రులు బరితెగించి మాట్లాడుతున్నారని అని రేవంత్ రెడ్డి విమర్శించారు.పైగా అమరుల్లో కేవలం 500మందిపైగా మాత్రమే సాయం అందించడం బాధాకరమన్నారు.

బండి పరిస్థితి బాగలేదు..?

బండి సంజయ్ మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలనని, బండి సంజయ్ కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. సానుభూతి వ్యక్త పరచడం తప్పా..సీరియస్​గా తీసుకోవద్దని సూచించారు.

Advertisement

Next Story