తలకొండపల్లిలో కుండపోత వర్షం.. భారీ స్థాయిలో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు

by Kavitha |
తలకొండపల్లిలో కుండపోత వర్షం.. భారీ స్థాయిలో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు
X

దిశ, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో శనివారం రాత్రి వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. అయితే గత వారం రోజుల కిందట మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు మండలంలోని సుమారు 136 చెరువులు, కుంటలలోకి సగానికి పైగా వరద నీరు వచ్చి చేరింది. దానికి తోడు నిన్న(శనివారం) రాత్రి కురిసిన కుండ పోత వర్షానికి సగానికి పైగా చెరువులు నుండి అలుగులు పారుతున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో మండలంలోని పెద్ద చెరువులైన చీపునుంతల గ్రామానికి చెందిన అమ్రాయి చెరువు, చుక్కాపూర్ ఎడవెల్లికి చెందిన చుక్కాయి చెరువు, రాంపూర్ గ్రామానికి చెందిన సూర్యారావు చెరువు, దేవుని పడకల్ చెందిన మహమ్మద్ ఖాన్ చెరువులు నిండి భారీ స్థాయిలో మత్తడి పోస్తున్నాయి. కాగా శనివారం రాత్రి కురిసిన వర్షం.. 7.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అలాగే చుక్కాపూర్‌లో 11.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో మండలంలోని ఈరన్న కుంట చెరువు, పందివానికుంట చెరువులు తెగిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed