కేసీఆర్ ఇకనైనా చిల్లర పనులు మానుకో.. తీన్మార్ మల్లన్న హెచ్చరిక

by Prasad Jukanti |
కేసీఆర్ ఇకనైనా చిల్లర పనులు మానుకో..  తీన్మార్ మల్లన్న హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే కేసీఆర్ కు ఆయన పరివారానికి మనసున పట్టడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల ప్రయోజనాల పరిష్కారం కోసం చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. ఏనాడు తెలంగాణ ప్రయోజనాలను కాంక్షించని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం జీర్ణం కావడం లేదని విమర్శించారు. శనివారం గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. ఏపీలో రోజా ఇంటికి వెళ్లి తెలంగాణ నీటితో రాయలసీమను రతనాల సీమగా చేస్తానన్న కేసీఆర్ ఒక వైపున ఉంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా మేము తీసుకుంటామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మరో వైపు ఉన్నారన్నారు.

తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు నాడు సీఎం హోదాలో అంగీకరించిన కేసీఆర్ ఈనాడు కృష్ణాజలాల్లో వాటా తీసుకురావాలని, ఏడు మండలాల్లు తిరిగి తీకుసురావాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంపినోడే శవం పక్కన కూర్చుని ఏడ్చినట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉందని సెటైర్ వేశారు. కేసీఆర్ ఇకనైనా ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకునే చిల్లర పనులు మానుకుని ప్రతిపక్ష నాయకుడి బాధ్యత నిర్వహిస్తే బాగుంటుందని హితవుపలికారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీపై విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణకు, ఏపీకి నిత్యం ఏదో గొడవ జరిగేలా నాడు కేసీఆర్ వ్యవహరిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం రెండు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ప్రయత్నిస్తున్నారని దీనికి కాంగ్రెస్ పార్టీ ములాఖత్ అయిపోయిందని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మాట అనడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి సంపదనంతా ఏపీకి దోచిపెట్టిన మీరు కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

Advertisement

Next Story

Most Viewed