టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్..?

by Satheesh |
టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో పదోతరగతి పరీక్షల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల తేదీలోపే వెల్లడించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 3 నుంచి 20 వరకు జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయింది. ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారంరోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది.

ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారని సమాచారం. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియ చేపట్టారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ముందుగానే ప్రారంభంకాగా ఫలితాలు కూడా ముందుగానే వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఈ వారంలో క్లారిటీ రానునుందని సమాచారం.

Advertisement

Next Story