రూపురేఖలు మార్చేస్తానన్న కేసీఆర్.. ఆ ‘వాసాలమర్రి’ ఇప్పుడెలా ఉందో తెలుసా?

by GSrikanth |
రూపురేఖలు మార్చేస్తానన్న కేసీఆర్.. ఆ ‘వాసాలమర్రి’ ఇప్పుడెలా ఉందో తెలుసా?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అప్పటి సీఎం కేసీఆర్ 2020 నవంబరులో ప్రకటించారు. 2021 జూన్‌లో గ్రామ ప్రజలతో సామూహిక భోజనాలు చేసి బహిరంగ సభలో ఏడాదిలో బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దుకుందామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇళ్ల నుంచి మొదలుకొని గ్రామంలో సకల సౌకర్యాలు కల్పించి.. ఏడాదిలోగానే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ.150 కోట్లు అయినా సరే.. ఖర్చు పెట్టి గ్రామం రూపురేఖలే మార్చేస్తామన్నారు. కానీ, ఇవన్నీ ప్రకటనలు, ప్రణాళికలకే పరిమితమయ్యాయి. కానీ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనినీ చేపట్టింది లేదు. కేసీఆర్‌ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అప్పటి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం వాసాలమర్రి గ్రామస్తులతో గ్రామాభివృద్ధి కమిటీ, శ్రమదాన కమిటీ, పరిశుభ్రత కమిటీ, హరితహారం కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామ పునర్‌నిర్మాణంపై నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌లో పర్యటించి, అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులను పరిశీలించారు. వాసాలమర్రిలోనూ అదేవిధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించడంతో అన్నిశాఖల అధికారులు గ్రామంలో పర్యటించి, సమస్యలతోపాటు ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు.

కొత్త ఇళ్ల నిర్మాణానికి సైతం అనుమతి నిరాకరణ...

అయితే వాసాలమర్రి గ్రామస్తులకు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్న అప్పటి ప్రభుత్వం నిర్మించలేదు. అయితే గ్రామంలోని కొందరు గ్రామస్తులు స్వయంగా ఇల్లు కట్టుకుంటామన్నా కూడ అనుమతి ఇవ్వలేదు. గ్రామంలో కొందరి ఇళ్లు శిథిలావాస్థకు గురై కూలిపోయే స్థితికి చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తగా ఇళ్లు కట్టుకుందామనుకున్నారు. దీని కోసం గ్రామపంచాయతీలో అనుమతి కోరితే అధికారులు నిరాకరించారు. అయితే ప్రభుత్వం ఇళ్లను నిర్మించకపోవడం...తమను కట్టుకోనివ్వడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు...

రసాభాసగా మారిన గ్రామసభ....

గ్రామంలో మోడల్ విలేజ్ నిర్మాణం కోసం అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. అయితే ఈ గ్రామసభ రసాభాసగా మారింది. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా పంచాయతీ తీర్మానం ఆమోదిస్తున్నట్లు సర్పంచ్ ఎలా చెప్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పునర్నిర్మాణంపై గ్రామ సభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇళ్లు కూల్చివేత.....

గ్రామంలోని పురాతన ఇళ్లను, గుడిసెలను తొలగించి, మొత్తం గ్రామస్థుల ఇళ్లు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే అధీనంలోకి తీసుకొని.. అందులో నూతనంగా లేఅవుట్‌ చేయాలని నిర్ణయించారు. నూతన లే అవుట్‌లో గ్రామంలో ఉన్న మొత్తం 570 కుటుంబాలకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలంలో ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న పలువురి ఇళ్లను తొలగించారు. గ్రామంలో రోడ్లు, ఇతర సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై సమగ్రంగా అధికారులు సర్వే చేపట్టారు. సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల భవనం, పంచాయతీ కార్యాలయం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీంతో గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

ఆశగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజలు....

అయితే ఈ ప్రభుత్వంలోనైనా తమ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్ననే ఆశతో గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వమైనా తమ గోడు విని, సమస్యలు తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఏడాదిలోపే బంగారు వాసాలమర్రిగా మారుస్తానని హామీ ఇచ్చి తర్వాత అటువైపు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మనోవేదనకు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed