తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్

by Satheesh |   ( Updated:2024-06-16 16:00:19.0  )
తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. నీట్ పరీక్షా వ్యవహారం తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు.

ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఆరోపణలు వస్తున్నా మోడీ సర్కార్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. అందులోనూ ఒకే సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం సందేహాలకు తావిచ్చిందన్నారు.

పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారు.. దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరుగకుండా ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ- పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు.. అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన తెలంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed