జగిత్యాలలో జోరుగా గంజాయి దందా.. మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత

by Sathputhe Rajesh |
జగిత్యాలలో జోరుగా గంజాయి దందా.. మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవలసిన యువత తప్పటడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జల్సాలకు అలవాటై నేర ప్రవృత్తిని అలవర్చుకుంటున్నారు. ఆఖరికి కన్నవారి కన్నీటికి కారణం అవుతున్నారు. సరదా కోసం అలవాటైన వ్యసనాలు కాస్త వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి.

గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలతో పాటు జల్సాలకు అలవాటు పడిన కొంతమంది యువత మొదట అప్పులు చేయడం ప్రారంభించి అవసరం అయితే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే స్థాయికి దిగజారుతున్నారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించి కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. యువత పెడదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కేవలం పోలీసులది మాత్రమే కాదని డ్రగ్స్, గంజాయి వంటి వాటి నిర్మూలనలో తల్లిదండ్రులు పిల్లలపై కన్నేసి ఉంచాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

గంజాయి మత్తులో..

నిత్యం ఏదో ఒక చోట గంజాయి కేసులు నమోదు కావటం వింటూనే ఉన్నాం. గంజాయి సరఫరా చేస్తున్న వారినో లేక సేవిస్తున్న వారినో పోలీసులు అరెస్ట్ చేయడం వంటి ఘటనలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాన్ షాపుల్లో సిగరెట్లు దొరుకుతున్నంత ఈజీగా యువతకు గంజాయి దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మద్యం తర్వాత యువత ఎక్కువగా గంజాయికి ఆకర్షితులవుతున్నారు. స్నేహితుల ద్వారా సరదా కోసం అలవాటై ఆ తర్వాత గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు.

ముఖ్యంగా కళాశాల స్థాయి విద్యార్థులు, యూత్ ఎక్కువగా గంజాయి కోరల్లో చిక్కుకుని భవిష్యత్తును కోల్పోతున్నారు. మైనర్లు కూడా గంజాయి కేసుల్లో పట్టుబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గంజాయి సరఫరా చేస్తున్న వారు, సేవించే వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినప్పటికీ వారు కళ్లు గప్పి సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే జిల్లాలోని కోరుట్ల రైల్వే స్టేషన్, జగిత్యాల పట్టణ శివారు ప్రాంతాలైన చల్ గల్, మంచినీళ్ల బావి ఏరియా, మల్యాల, కొడిమ్యాల మండలాలలోని నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి విక్రయాలకు బ్లాక్ పాయింట్స్‌గా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

దొంగతనాల్లో వారే ఎక్కువ..

దొంగతనం కేసుల్లో పట్టుబడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారి కొంతమంది దొంగతనాలు చేస్తుంటే ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జల్సాలు చేసేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన పలు దొంగతనాల్లో పట్టుబడిన 5మంది నిందితులలో 19 నుంచి 24 సంవత్సరాలలోపు వయసు గలవారే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది.

Advertisement

Next Story