బీఆర్ఎస్‌ పార్టీ పతనం ఆ రోజు నుండే స్టార్ట్ అయ్యిందా..?

by Satheesh |
బీఆర్ఎస్‌ పార్టీ పతనం ఆ రోజు నుండే స్టార్ట్ అయ్యిందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష.. ప్రజలతో ఆయనకున్నది పేగుబంధం.. కల్యాణలక్ష్మి స్కీమ్‌తో ఒక మేనమామ అయ్యాడు.. వృద్ధులకు ఆసరాగా నిలిచి పెద్ద కొడుకయ్యాడు.. ఇవీ తరచూ బీఆర్ఎస్ నేతల నుంచి వినిపించే మాటలు. ఉద్యమకాలంలో ఆ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలే పదేళ్ళ పాలన చూసిన తర్వాత ఇకపైన వద్దనే నిర్ణయానికి వచ్చారు. ఉద్యమ నాయకుడే పరిపాలకుడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, దేశానికే రోల్ మోడల్‌గా మారిందని కూడా గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఉద్యమ పార్టీగా చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానే కేసీఆర్.. ‘మాది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ’ అని ప్రకటించుకున్నారు.

ఒకవైపు ఉద్యమకారులకు తగిన న్యాయం చేయలేదని విమర్శలు వస్తున్న సమయంలో కేసీఆర్ ఈ కామెంట్ చేయడం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సొంత పార్టీ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇవ్వకపోవడం, ఉద్యమ వ్యతిరేకులను దగ్గరకు తీసుకోవడం.. ఇవన్నీ అప్పట్లో చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన, ద్వేషించినవారిని పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆయనను కలిసే అవకాశాన్ని అదృష్టంగా భావించే చాలా మంది విద్యార్థులు, ఉద్యమకారులకు అందని ద్రాక్షగానే మిగిలపోవడాన్ని తట్టుకోలేకపోయారు.

పేరుబంధమూ తెగిపోయింది:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించిన కేసీఆర్.. రెండేండ్ల కసరత్తు తర్వాత ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చారు. లాంఛనంగా 2022 అక్టోబరు 5న ప్రకటన చేశారు. తెలంగాణ సమాజానాన్ని ఉర్రూతలూగించిన ‘జై తెలంగాణ’ నినాదాన్ని విడిచిపెట్టి ‘జై భారత్’ అందుకున్నారు. తెలంగాణలో బలపడినట్లుగా ఇతర రాష్ట్రాల్లోకీ విస్తరించి జాతీయ పార్టీగా రూపొందాలని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పేరు మార్పుతోనే ఆయనకు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నట్లుగా ప్రజలతో ఆయనకు పేగుబంధం కూడా లేకుండా పోయిందన్నారు. పేరు మార్పుతోనే ఆయన పతనం ప్రారంభమైందని ఇప్పుడు ఫలితాల వెల్లడి తర్వాత ఓపెన్‌గానే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed