డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం..బెంగాల్ లో చిక్కిన దొంగలు

by Y. Venkata Narasimha Reddy |
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం..బెంగాల్ లో చిక్కిన దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14 లో ఉన్న ఆయన సొంత ఇంటికి దొంగలు కన్నం వేశారు. తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్‌ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్‌పూర్‌ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు.

వారి వద్ద 2.2 లక్షల రూపాయల నగదు, 100 గ్రాముల బంగారు నాణెం, కొంత విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్‌లో ఈ చోరీ ఘటనకు సంబంధించి నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ కోర్టుకు హాజరుపరచనున్నారు.


Advertisement

Next Story

Most Viewed