TSPSC Group-1: మెయిన్స్ పరీక్షల నిర్వహణ అప్పుడే?

by GSrikanth |   ( Updated:2022-12-17 02:29:51.0  )
TSPSC Group-1: మెయిన్స్ పరీక్షల నిర్వహణ అప్పుడే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్​-1 కొలువుల భర్తీ ప్రక్రియ మరింత సాగుతోంది. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష ఉంటుందని టీఎస్​పీఎస్సీ ముందుగా ప్రకటించింది. కానీ, హారిజంటల్​విధానం అమలుపై హైకోర్టు కేసు కారణంగా తుది ఫలితాల వెల్లడి వాయిదా పడతూ వచ్చింది. ప్రస్తుతం దీనిపై క్లారిటీ రావడంతో.. వచ్చేవారంలో ఈ ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనుకున్న సమయానికంటే మరింత ఆలస్యంగా గ్రూప్​- 1 మెయిన్స్​పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి లేదా ఏప్రిల్​నెలలో మెయిన్స్​ఎగ్జామ్ ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు గ్రూప్​- 2 ఉద్యోగాల నోటిఫికేషన్​కూడా త్వరలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని శాఖల నుంచి ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రాలేదని టీఎస్​పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్​పాటుగా పలు నోటిఫికేషన్లపై శుక్రవారం జరిగిన టీఎస్​ పీఎస్సీ పాలకవర్గం సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు.

ఎగ్జామ్స్​ సమయంలో కాకుండా..!

గ్రూప్​-1 మెయిన్స్​పరీక్షను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్​నెలలో నిర్వహించాల్సి ఉంటోంది. ప్రస్తుతం వచ్చేవారం తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత మెయిన్స్‌కు ప్రిఫేర్ అయ్యేందుకు అభ్యర్థులకు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటోంది. మూడు నెలల సమయం ఇవ్వకుంటే అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని టీఎస్​పీఎస్సీ భావిస్తున్నది. దీంతో పదో తరగతి, ఇంటర్​పరీక్షలు పూర్తయిన తర్వాతే గ్రూప్​-1 మెయిన్స్​ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఈ పరీక్షలను పని దినాల్లోనే నిర్వహించాల్సి ఉంటోంది. మెయిన్స్​ పరీక్షలు మొత్తం వారం రోజుల పాటు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అనువైన సమయం కోసం టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

క్వాలిఫైడ్​ అభ్యర్థులకే మాత్రమే

మరోవైపు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా విషయంలో టీఎస్​పీఎస్సీ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఫైనల్​కీ ప్రకటించిన దాదాపుగా నెల రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో తుది జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు కేసు అడ్డుగా మారింది. అయితే, ఇప్పుడు కేసులో తీర్పు రావడంతో.. మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యే అభ్యర్థులకు నేరుగా సమాచారం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పరీక్ష రాసిన మూడు లక్షల మందిలో క్వాలిఫైడ్ జాబితాను ఓపెన్‌గా ప్రకటించకుండా నేరుగా అభ్యర్థులకు మెయిన్స్ అడ్మిట్ కార్డు ఇవ్వాలని భావిస్తున్నది. జాబితాను ప్రకటించటంతో పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని, దానితో అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుత్లో యూపీఎస్సీ తరహాలో అభ్యర్థులకు క్వాలిఫై లెటర్లు పంపించనున్నట్లు టీఎస్​ పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. పోస్టుల రిజర్వేషన్లను బట్టి.. ఒక్కో పోస్టుకు 50 మందిని మెరిట్ ప్రకారం క్వాలిఫై చేస్తామని టీఎస్పీఎస్సీ ముందుగానే ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రెడీ అవుతుందని అంచనాగా వెల్లడిస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారుగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఓటీఆర్‌ను ఓపెన్ చేసుకుని, క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ అడ్మిట్ కార్డు పొందే వీలుంటుందని, తాము క్వాలిఫై అయ్యారా.. లేదా.. దీని ద్వారానే తెలుసుకునే వీలుంటుందని టీఎస్​పీఎస్సీ అధికారులు వెల్లడించారు. అంతేతప్ప ప్రత్యేకంగా క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా వెబ్ సైట్లో అందుబాటులో ఉండదని స్పష్టమవుతోంది.

హారిజంటల్ విధానమే

గ్రూప్ - 1 పై టీఎస్ పీఎస్సీ తొందరపాటు నిర్ణయాలకు హైకోర్టు మొట్టికాయలు వేసినంత పని చేసింది. మహిళా రిజర్వేషన్ల అంశంలో వర్టికల్ విధానంలో కాకుండా.. హారిజంటల్ విధానాన్ని అమలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను టీఎస్​పీఎస్సీకి పంపించారు. గురువారం రాత్రి హైకోర్టు తీర్పు కాపీలు టీఎస్ పీఎస్సీకి అందాయి. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర తీర్పు ఉండటంతో తుది ఫలితాల వెల్లడి ఆగిపోయింది. వాస్తవానికి దేశంలోని నియామక సంస్థలన్నీ (90 శాతం) వరకు మహిళా రిజర్వేషన్లలో హారిజంటల్ విధానాన్నే అవలంభిస్తున్నాయి. కానీ, టీఎస్​పీఎస్సీ మాత్రం పాత నిబంధనలు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పొరపాట్లను తీసుకుని వర్టికల్​ విధానాన్ని ప్రకటించాయి. దీనిపై కోర్టు మెట్లు ఎక్కుతారని ముందే ఊహించారు. అనుకున్నట్టే పురుష అభ్యర్థులు కోర్టుకెక్కారు. ఇటీవల ఏపీలో చేపట్టిన నియామక నిబంధనలను సైతం పిటిషన్‌లో ఉదహరించారు. రాష్ర్ట విభజన జరిగిన ఏపీలో కూడా హారిజంటల్ విధానాన్ని తీసుకున్నారని, దీంతో అక్కడ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వలేదని వెల్లడించారు. హారిజంటల్‌లో భాగంగా జనరల్ కేటగిరీలో మహిళలు నియామకమైతే.. వాటిని 33 శాతం రిజర్వేషన్ల నుంచి తొలిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ రాకపోవడంతో.. ఏకంగా ఫలితాలపై స్టే ఇచ్చింది. తాజాగా దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఇప్పుడు అమలు చేయాలని సూచించింది. గ్రూప్​-1లో మహిళల రిజర్వేషన్లు 33.33 శాతం మించరాదని, జనరల్​కోటాలో ఈ శాతంలో మహిళలు అర్హత సాధిస్తే.. మళ్లీ ప్రత్యేకంగా రిజర్వేషన్​అమలు చేయరాదని, గతంలో రాజస్థాన్​పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరాంచల్ కమిషన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో టీఎస్ పీఎస్సీ కూడా హారిజంటల్ విధానం అమలు చేయాల్సి రావడం అనివార్యంగా మారింది.

Also Read...

NIT రూర్కెలాలో 147 నాన్ టీచింగ్ పోస్టులు

Advertisement

Next Story

Most Viewed