మా సేవలు వినియోగించుకోండి.. కోదండరెడ్డికి పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
మా సేవలు వినియోగించుకోండి.. కోదండరెడ్డికి పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యలు శాశ్వతంగా తొలగించేందుకు 2006లో తమ వ్యవస్థ వచ్చిందని, జీవో 58, 59, కోనేరు రంగారావు కమిటీ(Koneru Ranga Rao Committee) సిఫారసు అమలులో తామంతా పని చేశామని పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు అన్నారు. మండలానికి ఒకరు చొప్పున పనిచేశామని.. ప్రస్తుతం చాలా వరకు సెర్ప్‌లో సీసీలుగా, ఇతర పనులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. తమను రెవెన్యూ సేవల కోసం వినియోగించుకోవాలని వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి(M. Kodanda Reddy), రెవెన్యూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్‌(M. Sunil)ను కోరారు. ఈ మేరకు సోమవారం వారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్వోఆర్ 2024 ముసాయిదా చట్టంలో పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రతిపాదించారన్నారు. తెలంగాణ డీఆర్డీఏ సెర్ప్‌లోని పారా లీగల్(భూ విభాగం) వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు.

భూ సమస్యలపై అపార్డ్, రెవెన్యూ అధికారులు, నల్సార్ యూనివర్సిటీలో శిక్షణ పొందినట్లు గుర్తు చేశారు. 2006 నుంచి 2014 వరకు భూ సంబంధిత అంశాలపై పని చేశామన్నారు. 2014 తర్వాత సెర్ప్‌లో ల్యాండ్ యూనిట్‌ను భూ సమస్యల పరిష్కారం కోసం నియమించబడిన తమతో ఇతర పనులు చేయిస్తున్నారన్నారు. పారా లీగల్, సర్వేయర్లు రెవెన్యూ శాఖకు, రైతులకు అనుసంధాన కర్తలుగా ఉంటూ లక్షల భూ సమస్యలను పరిష్కరించిన అనుభవం తమకు ఉందన్నారు. కమ్యూనిటీ సర్వేయర్లు కూడా ఐటీఐ డిప్లామో చేసిన వారేనని, వారందరూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖలో శిక్షణ పొందారన్నారు.

ఎక్కడ సర్వే సమస్య వచ్చినా అక్కడి వెళ్లి సర్వే చేసి రిపోర్టు ఇవ్వగల నిష్ణాతులు ఉన్నారన్నారు. 110 మంది కమ్యూనిటీ సర్వేయర్లు, 130 మంది పారా లీగల్స్ డీఆర్డీఏలోనే ఇతర పనులు నిర్వర్తిస్తున్నామన్నారు. తామందరినీ భూ సమస్యల పరిష్కారం వినియోగించుకోవాలని కోరారు. కోదండరెడ్డిని కలిసిన వారిలో పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు కొయ్యడ శంకరయ్య, మంచాల నర్సింహ, సాయిలు, నగేశ్, ముత్తయ్య, మహేశ్, వెంకటేశ్ ఉన్నారు.

Next Story

Most Viewed