- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రాజకీయ వేడిని పెంచుతున్న సుంకిశాల ఇష్యూ
దిశ, నాగార్జునసాగర్: సుంకిశాల ప్రాజెక్టు పుణ్యమంటూ తెలంగాణ పాలిట్రిక్స్ హాట్ హాట్‌గా మారిపోయాయి. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా నేపథ్యంలో గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన సుంకిశాల పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోందని చెప్పాలి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికీ వారు.. పక్క పార్టీలపై నెపం వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిజానికి సుంకిశాల పంప్‌హౌజ్ పరిస్థితి ఏంటి.? రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్ల నష్టమెంత..? పనులను పునరుద్ధరించేందుకు ఎంత సమయం పడుతుంది..? అనే అంశాలతో సంబంధం లేకుండా పోయింది.
అధికార కాంగ్రెస్ పార్టీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం చిన్న ఘటనేనని.. పెద్దగా నష్టం లేదని.. ఏజెన్సీనే భారం మోస్తుందని చెప్పుకొచ్చింది. పైగా సుంకిశాల ప్రాజెక్టును ప్రారంభించింది బీఆర్ఎస్.. పనులు చేసింది బీఆర్ఎస్.. మాకేం సంబంధం లేదన్న తరహాలో మాటలు చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఆ రెండు పార్టీలు దొందు దొందేనని సెటైర్లు వేస్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం పక్కదోవ పట్టిందనే చెప్పాలి.
అసలు సుంకిశాల ప్రాజెక్టు ఉద్దేశ్యమిదే..
నిజానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తి తీర్చేందుకు సుంకిశాల తాగునీటి పథకాన్ని గత బీఆర్ఎస్ సర్కారు మొదలుపెట్టింది. మరో 50 ఏండ్ల అవసరాలను అంచనా వేసి కనీసం 71 టీఎంసీల నీటి అవసరాన్ని గుర్తించి రాజధాని తాగునీటి అవసరాల కోసం క్రిష్ణా జలాలను తరలించే ఈ పథకానికి రూపకల్పన చేశారు. వాస్తవానికి నాలుగు దశాబ్దాల కిందటిది ఈ పథకం. కానీ, రెండేళ్ల కిందట పట్టాలెక్కింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 మే 14వ తేదీన అప్పటి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి తదితరులు పనులకు శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. వాస్తవానికి పుట్టంగండి (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) నుంచి ప్రస్తుతం హైదరాబాద్ కు తాగునీరు అందిస్తున్నారు. ఎఎంఆర్పిలో కీలకమైన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు సాగర్ వెనుక జలాల నుంచి పుట్టంగడి వద్ద నీటిని ఎత్తిపోసి తీసుకుంటారు. అక్కంపల్లి రిజర్వాయరు నుంచి కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు నీటిని చేర్చి, అక్కడ శుద్ధి చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎ.ఎం.ఆర్.పి శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్టులో భాగం.
శ్రీశైలం టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే, క్రిష్ణా జలాలను టన్నెల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ కి నీరు చేరుతుంది. అపుడు పుట్టంగండి వద్ద అతి దిగువ నుంచి అతి ఎగువకు నీటిని ఎత్తి పోయాల్సిన అవసరం కూడా ఉండదు ఎస్.ఎల్.బి.సికి సరిపడా నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తే.. రూ.2,215 కోట్ల అంచనా వ్యయంతో సుంకిశాల ప్రాజెక్టును మొదలు పెట్టాల్సిన అవసరమే ఉండదు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్టును పక్కన పడేసి, కొత్త ప్రాజెక్టును తీసుకోవడంలోనే మతలబు దాగి ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, సాగర్ లో నీటి మట్టం 510 అడుగుల కిందికి పోతే పుట్టంగండి నుంచి నీటిని తీసుకోలేమని, వేసవిలో తాగునీటి సమస్యలు వస్తున్నాయని, అందుకే సాగర్ లో నీటి మట్టం 462 అడుగుల ఉన్నా (డెడ్ స్టోరేజీ) ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని తీసుకోవచ్చని చెబుతున్న బీఆర్ఎస్ వర్గాలు, ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని చేర్చి తాగునీటికి వాడుకోవచ్చనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించి మాట్లాడడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అమాంతం పెరిగిన అంచనా వ్యయం..
సుంకిశాల తాగునీటి పథకం అంచనా వ్యయం రూ.1450 కోట్లతో మొదలు పెట్టి, రూ.2,215 కోట్లకు చేర్చారు. పర్సెంటేజ్ కోసం తమకు అనుకూలమైన సంస్థకు పనులు అప్పజెప్పారు. అసలు అవసరం లేని ప్రాజెక్టులను చేపట్టడంలోనే అసలు మతలబంతా దాగి ఉందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ పనులకు టెండర్ పిలిచింది, మేఘ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది నాటి కేసీఆర్ నేత్రుత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వెల్, వాటర్ పంప్, పంప్ హౌజ్, 3 సొరంగాలు, పంప్ హౌజ్ కు ఓ స్ట్రక్చర్, కోదండాపూర్ ప్లాంట్ వరకు మూడు వరుసల పైప్ లైన్లు, మోటార్ల కొనుగోలు, తదితర పనులు కలిసి ఉన్నాయి. ఇందులో ఇన్ టేక్ వెల్ పనులు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ పనుల రూపంలో పర్సెంటేజీలు చేతులు మారాయన్నదే కాంగ్రెస్ ఆరోపణ. శ్రీశైలం టన్నెల్ నుంచి నీటిని తీసుకోవాలంటే.. ఆ పనులు చేస్తే సరిపోయేది. అప్పటి దాకా పుట్టంగండి నుంచి తీసుకునే వీలుంది. అయినా కొత్త ప్రాజెక్టు తీసుకోవడంలో ఉన్న మతలబు ఏమిటి ’..అన్న ప్రశ్నలు లేకపోలేదు. కాగా, సుంకిశాల లో జరిగిన సంఘటన వల్ల రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని హైదరాబాద్ జల మండలి ప్రకటించగా, ఆ నష్టం అంతా ఇంజనీరింగ్ సంస్థ భరిస్తుందని కూడా ప్రకటించింది.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే..
గత ఏడాది వేసవి నాటికే పనులు పూర్తై అందుబాటులోకి రావాల్సిన ఈ పథకానికి ఆది నుంచీ అన్నీ రాజకీయ అడ్డంకులే. సుంకిశాల పంప్ హౌజ్‌లో నిర్మించిన రక్షణ గోడ ఈ నెల 1వ తేదీన కూలిపోవడంతో 590 అడుగుల లోతు ఉన్న పంప్ హౌజ్ పూర్తిగా సాగర్ జలాలతో నిండిపోయింది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం కనీసానికి పడిపోతే కానీ, ఈ పనులు తిరిగి మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ఉద్దేశంతో 1980లోనే సుంకిశాల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో పనులు మొదలు పెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. జిల్లాకు చెందిన సీపీఎం, టీడీపీ వర్గాలు అడ్డుపడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు జరిగి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏఎమ్మార్పీని పూర్తి చేసి హైదరాబాద్‌కు తాగునీరు తరలిస్తున్నారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమయంలోనే ఇక్కడి నుంచి జిల్లా రైతాంగానికి సాగునీరు, ప్రజానీకానికి తాగునీరు ఇవ్వకుండా నీటిని లా తీసుకుపోతారని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ సమయంలో ఏర్పాటు చేసిన కోట్ల కార్యక్రమం సందర్భంగా పోలీస్ ఫైరింగ్ కూడా జరిగింది. దీంతో సుంకిశాల అటకెక్కింది. చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఏఎమ్మార్పీ రూపుదిద్దుకుంది. ఇపుడు బీఆర్ఎస్ నేతలు చెబుతున్న ప్రకారం ఏఎమ్మార్పీ నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా తాగునీటిని తీసుకోవడం ఆపేసి కేవలం సుంకిశాల నుంచి మాత్రమే తీసుకునేందుకే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. కానీ, ఈ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చును శ్రీశైలం టన్నెల్‌కు కేటాయించి ఉంటే, క్రిష్ణా జలాలే అక్కంపెల్లికి చేరేవని, అటు సాగు, తాగునీటి అవసరాలు తీరేవి కదా అన్న బలమైన వాదన ప్రభుత్వ పెద్దల్లో లేకపోలేదు.
సుంకిశాల పై న్యాయ విచారణ జరిపించాలి: బీజేపీ
నల్లగొండ జిల్లా సుంకిశాల ప్రాజెక్టును మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసి ప్రాజెక్టు వాల్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం బాధ్యత నిర్మాణ సంస్థ మెఘా దేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. నాసిరకం నిర్మాణం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్తున్నారని, గత ప్రభుత్వ తప్పిదం వల్లే జరిగిందని చెప్పి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తుమ్మల, ఇద్దరూ జరిగిందేదో జరిగింది, ఏజెన్సీదే బాధ్యత. ప్రభుత్వంపై భారం లేదంటూ, దాన్ని చిన్న సంఘటనగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మరుసటి రోజు నుంచి అటు ఇంజినీర్లు, ఇటు ఏజెన్సీ.. ఎవరిపైనా చర్య తీసుకోలేదు. ఈ ప్రాజెక్టు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుందని, అయినా ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను కొత్త ప్రభుత్వం ఎందుకు పర్యవేక్షించ లేదని ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యమని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ ఒక్క కంపెనీకే కట్టబెడుతున్నారంటూ గతంలో కాంగ్రెస్ విమర్శించిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదేపని చేస్తున్నదని ఆరోపించారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనను గోప్యంగా ఉంచడంలో బాధ్యులెవరో తేల్చి.. వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రమాద విషయాన్ని మేఘా కంపెనీ ప్రభుత్వం దృష్టికి తెచ్చిందా..? లేదా..? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని, ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మేఘా సంస్థ మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు.