మోడల్ స్కూల్లో దారుణం.. విద్యార్థినీల చేతులు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్

by Bhoopathi Nagaiah |
మోడల్ స్కూల్లో దారుణం.. విద్యార్థినీల చేతులు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
X

దిశ, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. జావ తాగుతున్న ఇద్దరు విద్యార్థినీలపై ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా దాడి చేసి చేతి వేళ్లను తిరిగొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వలిగొండ మండలంలో జరిగింది. విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..

వలిగొండ మండలం, లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్‌లో వర్కట్ పల్లి గ్రామానికి చెందిన గోగు అఖిల, నాతాళ్లగూడెం గ్రామానికి చెందిన కోరబోయిన అక్షితలు 8వ తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం జావ తాగుతుండగా.. ఇంకా ఎంతసేపు తాగుతారు అంటూ ప్రిన్సిపల్ రహి సున్నిసా బేగం బూతులు తిడుతూ తమపై పైపుతో దాడి చేసిందని విద్యార్థినీలు తెలిపారు. ఆ తర్వాత క్లాసులు అయిపోయాక ఇంటికి వెళ్లిపోయామన్నారు. చేతులు నొప్పిగా ఉన్నా ప్రిన్సిపల్ మేడమ్ మళ్లీ కొడుతుందేమోనన్న భయంతో ఇంట్లో చెప్పలేదన్నారు. శుక్రవారం స్కూల్‌కు వెళ్లగా.. మమ్ముల్ని పరిశీలించిన ప్రిన్సిపల్ రహి సున్నిసా బేగం మేడమ్.. చేతుల వాపును చూసి వలిగొండలోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందన్నారు. పరిశీలించిన డాక్టర్ ఒకరికి బొటన వేలు, మరొకరికి మణికట్టు కీలు విరిగిందని చెప్పి కట్లు కట్టి పంపించినట్లు చెప్పారు. పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లిన విద్యార్థినీల చేతులకు కట్లు చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని వాకాబు చేయగా.. జరిగిన విషయం తెలిపారు.

శని, ఆదివారం స్కూల్‌కు సెలవులు కావడంతో సోమవారం పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ రహి సున్నిసా బేగంను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు విద్యార్థినీల తల్లిదండ్రులు చెప్పారు. ఒకసారి క్షమించండి అని, మరోసారి ఇలాంటి పొరపాటు చేయనని చెబుతుందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు విరగొట్టి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ఏంటని వారు ప్రశ్నించారు. చదువు చెప్పమని స్కూల్‌కు పంపిస్తే ఇలాగే చేతులు విరిగేలా చావబాదుతారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed