అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు.. నేతలు కాదు : పువ్వాడ

by Sathputhe Rajesh |
అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు.. నేతలు కాదు : పువ్వాడ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు అని నేతలు కాదని స్పష్టం చేశారు.

కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మా నాన్న.. నేను అడుగు పెట్టామని ఇది ప్రజల ఆశీర్వాదంతోనేని పేర్కొన్నారు. మా చేతుల్లో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్మించేదని వెల్లడించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం ఇప్పటికి నెరవేర్చకపోవడం అన్యాయం అన్నారు. బయ్యారం, కడపలో పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తుందన్నారు.

బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు వున్నాయని జాతీయ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చెప్పిందన్నారు. బయ్యారంలో క్వాలిటీ ఫెర్రస్ లేదని బీజేపీ నేతలు అసత్యాలు చెప్తున్నారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలాగే మాట్లాడడం దుర్మార్గమన్నారు. బైలాదిల్లా ఐరన్ కంపెనీని జపాన్, కొరియా కంపెనీకి లీజుకు ఇచ్చారని.. దానిని రద్దు చేసి బయ్యారం, విశాఖ ఫ్యాక్టరీకి ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వెంటనే ఆదానికి ఇచ్చిన ఆ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బైలాడిల్లా నుండి ఐరన్ ఓర్‌ను 1800 కిలోమీటర్లు వున్న ముంద్రాకు తరలిస్తున్నారని 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారంనకు మాత్రం మొండి చేయి చూపారన్నారు.

ఖమ్మం జిల్లా సమస్యలను భట్టి ఎప్పుడైనా పట్టించుకున్నారా? సమస్యలు వదిలేసి భట్టి ఎక్కడో పాదయాత్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విషయ పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. బయ్యారంపై కేంద్రాన్ని నిలదీసేది పోయి కాంగ్రెస్ వంతపడడం సిగ్గుచేటు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుట్ర జరుగుతుందని.. దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రయివేటీకరణకు బీఆర్ఎస్ మొదటి నుండి వ్యతిరేకంగా వుందని, విభజన చట్టంలో వున్న అంశాలను కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మరోసారి పేర్కొన్నారు. బయ్యారంలో 134 లక్షల మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ వుందని కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఆదానికి కేటాయించిన లీజును రద్దు చేసి బయ్యారం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed