- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేత్రపర్వం.. నాచగిరి లక్ష్మీనరసింహుడి రథోత్సవం..

దిశ,వర్గల్ : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు..ఆశిత్రజన పాలకుడు.. లోక రక్షకుడైన నాచాగిరి శ్రీ లక్ష్మీ నరసింహుడి రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం తర్వాత.. గరుడ,గజ,పొన్న,శేష,హంస, ఇలా తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో ఊరేగిన స్వామివారు శనివారం తన ప్రధాన వాహనమైన రథం పై విహరించాడు. భక్తులు జయజయధ్వానాలు చేస్తుండగా..మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలుకుతుండగా..తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారు అభలగోపాలన్ని భక్తి సాగరంలో ముంచెత్తారు.
తెలంగాణ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా వెలుగొందుతున్న నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్ర నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుoడగా, శనివారం తెల్లవారుజామున నిర్వహించిన స్వామి వారి విమాన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ అధికారి విశ్వనాధ్ శర్మ నేతృత్వంలో స్వామి వారి విమాన రథోత్సవ ఏర్పాట్లు నిర్వహించగా, శుక్రవారం అర్ధరాత్రి దాటాక వేద పండితులు, ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విమాన రథంపై సతీసమేతులైన శ్రీ స్వామి వారిని అదిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల వరకు విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తుల దర్శనార్థం ఉంచి అనంతరం నాచగిరి పురవీధుల్లో భక్తజనుల జయ జయ ద్వానాల మధ్య ఊరేగుతూ తన్మయ పరిచారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తుల భజనలు, కోలాటాలు, యువజనుల నృత్యాల మధ్య రథోత్సవం ఘట్టం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమాల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దాతల సహకారంతో మహా ప్రసాదం అందజేశారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి మెదక్,రంగా రెడ్డి జిల్లా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
స్వామివారి సేవలో మాజీ ఎమ్మెల్యే..
రథోత్సవం సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పూర్ణకుంభంతో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు స్వాగతం పలికారు. పూజల అనంతరం శాలువాలతో సన్మానించి స్వామి వారి మెమెంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.