అధికార పార్టీ నాయకుని కీ రోల్..! రూ.2కోట్ల భూమి కబ్జా..

by Sathputhe Rajesh |
అధికార పార్టీ నాయకుని కీ రోల్..! రూ.2కోట్ల భూమి కబ్జా..
X

దిశ, నిఘా బ్యూరో: ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాల్సిన పాలకులే.. భక్షకులయ్యారు. ఒకటీ కాదు రెండు ఏకంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా కాజేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. రూ.కోట్ల పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం కాస్త రచ్చకెక్కింది. దాన్ని సద్దుమణిగించేందుకు కౌన్సిలర్లను ఏకంగా గోవా టూర్‌కి తరలించారో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి. ఇంతకీ ఏవరా ప్రజాప్రతినిధి..? ఏంటా లిటిగేషన్ అనుకుంటున్నారా..?.

అది మరెక్కడో కాదు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలోనే. అసలే నకిరేకల్ నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లాలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో దండెకుంటలోని సర్వే నంబరు 89 ఉంది. సమీపంలోని వాసవీ కాలేజీ పక్కన పాత జాతీయ రహదారిని అనుకుని దాదాపు 700 గజాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని సైతం నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీ ఇదే స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ పాతడంతో పాటు చెట్లను సైతం నాటారు.

కానీ ఇటీవల హఠాత్తుగా ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ డాక్యుమెంట్స్‌తో రంగంలోకి దిగడం.. దాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించడం.. గేట్లు పెట్టి తమ స్వాధీనంలోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రోజుల వ్యవధిలోని ప్రభుత్వ భూమి కాస్త పట్టా భూమిగా మార్చడం సదరు ప్రజాప్రతినిధికే చెల్లిందంటూ విమర్శలు విన్పిస్తున్నాయి.

మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమా..? మరేదైనానా..?

నిజానికి నకిరేకల్ పట్టణంలోని వాసవీ కాలేజీ సమీపంలో గతంలో స్థానికంగా ఓ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వెంచర్ నిర్వాహకులు 10 శాతం ల్యాండ్ కింద 700 గజాల స్థలాన్ని అప్పటి గ్రామపంచాయతీకి అప్పగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మరి ఆ 10 శాతం ల్యాండ్ ఎక్కడ పోయిందంటే మాత్రం.. ఇంకా సదరు వెంచర్ నిర్వాహకులు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదంటూ అధికారులు బదులిస్తున్నారు.

దీనికితోడు సదరు వివాదస్పద స్థలం ప్రైవేటు వ్యక్తులదని రెవెన్యూ శాఖ తేల్చడంతోనే తాము పల్లె ప్రకృతి వనాన్ని ఉపసంహరించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఏలాంటి ధ్రువీకరణ లేకుండా ఏ ప్రైవేటు వ్యక్తుల స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడంలో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వహించారా..?. పల్లె ప్రకృతి వనం పేరుతో వందలాది మొక్కలను చనిపోవడానికి కారణం అవ్వడంతో పాటు ప్రజాధనం సైతం వృథా చేశారా..?. ఓ బాధ్యతాయుతమైన మున్సిపల్ కమిషనర్ ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిదే కీ రోల్.. కౌన్సిలర్ల గోవా టూర్..

ప్రస్తుతం కబ్జా చేసిన ప్రభుత్వ స్థలం అత్యంత విలువైనది. జాతీయ రహదారిని అనుకుని ఉండడం వల్ల విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి స్థలంపై కన్నేసిన కొంతమంది వ్యక్తులతో సదరు ప్రజాప్రతినిధితో చేతులు కలిపారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ స్థలం సెటిల్‌మెంట్ వ్యవహారంలో వచ్చిన డబ్బుల విషయంలో సదరు ప్రజాప్రతినిధి, కౌన్సిలర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అసలు విషయంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రతిపక్షాలకు ఉప్పందించారు.

అదికాస్త రచ్చగా మారుతుండడం.. కౌన్సిలర్లు లోకల్‌గా ఉంటే ప్రమాదంగా మారుతున్న విషయాన్ని ఆ ప్రజాప్రతినిధి పసిగట్టారని, ఆ క్రమంలోనే కౌన్సిలర్లను గోవా టూర్ తీసుకెళ్లారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుంటే.. కబ్జా విషయంతో పాటు నకిరేకల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి మూడు నెలలు గడుస్తున్నా.. నేటికీ సమావేశం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉన్నతాధికారులకు పలువురు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. దీనికితోడు మున్సిపాలిటీ పరిధిలోని భూతగాదాల్లో సదరు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని.. అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించడం, సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed