- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటా చౌర్యం కేసులో విచారణ ముమ్మరం.. సైబరాబాద్ అధికారులతో భేటీ అయిన ఆర్మీ, నేవీ అధికారులు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. సిట్‌లోని సైబర్ ఎక్స్‌పర్ట్స్ వీరిని విచారిస్తున్నారు. మరోవైపు ఆర్మీ ఇంటెలిజెన్స్ వింగ్, నేవీకి చెందిన అధికారులు బుధవారం సైబరాబాద్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల ఎనభై లక్షల మందికి సంబంధించిన డేటాను తస్కరించిన గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దీంట్లో ఆర్మీలోని రెండున్నర లక్షల మందికి చెందిన డేటా ఉంది. విచారణలో నిందితులు ముఖ్యంగా జస్ట్‌డయల్ సంస్థతోపాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులతోపాటు వేర్వేరు యాప్‌ల నుంచి ఈ డేటాను సేకరించినట్టు వెల్లడైంది. దేశ భద్రత, ప్రజల రక్షణ దృష్ట్యా సున్నితమైన అంశం కావడంతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నట్టుగా చెప్పారు.
నోటీసులు జారీ
కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిట్‌కు అప్పగించారు. ఐపీఎస్ కల్మేశ్వర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. సిట్‌లో సైబర్ క్రైం విభాగం పోలీసులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిని ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ తొమ్మిది మంది నిందితులకు డేటాను విక్రయించారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిందితులు వీళ్లను ఎలా కాంటాక్ట్ చేశారు? ఎవరెవరి నుంచి ఎంత డేటా తీసుకున్నారు? ఎంత డబ్బు ఇచ్చారు? అన్న వివరాలను తీసుకుంటున్నట్టు సమాచారం.
విచారణలో ఆయా బ్యాంకుల కాల్సెంటర్లలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు వెల్లడైనట్లు తెలిసింది. వీళ్లు ఆఫీసులకు రాగానే తమతోపాటు తెచ్చుకున్న పెన్డ్రైవ్లలోకి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని విక్రయించుకున్నట్టుగా తెలియవచ్చింది. ప్రధానంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లో పనిచేస్తున్న ఉద్యోగులే సూత్రధారులని తెలుస్తోంది. పద్దెనిమిది కేటగిరీలకు సంబంధించిన వివరాలు సైబర్ నేరగాళ్లకు అందినట్టు తేలిందని సమాచారం. కాగా, నిందితులు విదేశాలకు ఏమైనా డేటాను లీక్ చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు.
ఆర్మీ, నేవీ అధికారుల రాక
తస్కరించిన డేటాలో ఆర్మీ, నేవీలకు చెందిన ఉద్యోగుల వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఆ విభాగాలకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం సైబరాబాద్ అధికారులను కలిశారు, ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను ముఖ్యంగా ఆర్మీ, నేవీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.