- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Minister : నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి..
దిశ, ముషీరాబాద్ : నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద శనివారం చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారని, 1500 మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి, లాఠీలు జులిపించగా సుష్మాస్వరాజ్ విద్యార్థుల ఆకాంక్షను, గుండె చప్పుడును పార్లమెంటులో వినిపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా తెలంగాణ యువతను మోసం చేశారన్నారు. బీజెవైఎం కార్యకర్తల పై, నిరుద్యోగుల పై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ధర్నాచౌక్ లో ఉద్యమాలు చేయొద్దని నిషేధం విధించిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడ మల్లన్న అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉస్మానియా విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఎక్కడపోయాయి ? జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారా అని నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు.
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏక్కడ, ఎలక్ట్రిక్ స్కూటీలు ఏవి అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ లోకి కాంగ్రెస్ నాయకులకు, పైరవీకారులకు ఎంట్రీ ఉంటుంది కాని, నిరుద్యోగ యువకులను వెళ్లనివ్వడం లేదన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నాయని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలే గుదిబండలుగా మారుతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారాయని చెప్పారు. గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చిందని కేసీఆర్ దోపిడీ పోయి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దోపిడీ వచ్చిందని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీ మంత్రులు, హైకమాండ్ కు మాత్రమే లాభం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, అధికార దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. నాడు ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చకున్నారు. ప్రస్థుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న, మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, నాయకులు రాంచందర్ రావు, రాణిరుద్రమ, విజయలక్ష్మి తదితర యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.