- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: నిధుల సేకరణకు తెలంగాణ సర్కార్ మరో భారీ స్కెచ్..!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆదాయం కోసం భూముల అమ్మకాన్ని సర్కారు ప్రత్యమ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు చాలా సంక్లిష్టంగా మారడంతో భూములపై కన్నేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయ వనరుల సమీకరణ (రిసోర్స్ మొబిలైజేషన్) కోసమే ఏకంగా ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి వాటిని అమ్మేయడం ద్వారా నిధులను సమకూర్చుకోవడమే ప్రధాన టాస్కుగా పెట్టుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ ధర పలికే భూములు ఏయే జిల్లాల్లో ఉన్నాయో గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేవాదాయ, వక్ఫ్ భూములపై ఎలాగూ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ ఉండదు కాబట్టి అవి మినహా అసైన్డ్ లాండ్స్ సహా మొత్తం సర్కారు భూములను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై నమ్మకం తక్కువే
రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ కోసం లోన్ల రూపంలో అప్పులు అవసరానికి తగినంతగా పుడతాయనే ఆశలూ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయం అందుతుందన్న నమ్మకమూ లేదు. ఇక ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా ఆశించిన స్థాయిలో రుణాలు వస్తాయనే భరోసా లేదు. దీంతో స్వీయ ఆదాయమే ఏకైక మార్గంగా ప్రభుత్వం ఎంచుకున్నది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచడానికి ప్రభుత్వం సాహసించే అవకాశం లేదు.
మద్యం ధరల పెంపు, కొత్త పన్నుల విధింపు జోలికి వెళ్లడానికి ధైర్యం చేయకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను అమ్మేయడంతో పాటు ఇతర రకాల నాన్-టాక్స్ రెవెన్యూను పెంచుకోవడంపేనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హెచ్ఎండీఏ భూముల విక్రయంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు, కమర్షియల్ ప్రాంతాలు, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న గ్రామాలు, జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ భూములతో పాటు ఎక్కడెక్కడ సర్కారుకు విలువైన భూములున్నాయో లెక్కలు తీసి వాటిని అమ్మేయడంపై దృష్టి సారించింది.
స్పెషల్ ఎకానమిక్ జోన్లకు గతంలో ఇచ్చిన భూములు వినియోగంలో లేకుండా కంపెనీల పేర్లతో ఉంటే.. వాటికి నోటీసులు జారీచేసి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తున్నది. జిల్లాలవారీగా గుర్తించిన భూములు, వాటి మార్కెట్ ధర, ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూరుతాయో అంచనా వేసి ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం వస్తుందో త్వరలో లెక్కలు తేల్చనున్నది.
వీలైనంత తొందరగా..
ఐడెంటిఫికేషన్, అసెస్‌మెంట్ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయితే ఆ తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఆ భూములను అమ్మి నిధులను రెడీ చేసుకోవాలని ప్రణాళికలను రూపొందించుకున్నది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు చెందిన భూములు గతంలో పలు పరిశ్రమలకు ఇచ్చినా అవి వినియోగంలో లేకపోతే వాటిని తిరిగి తీసుకుని ఎక్కువ ధరకు విక్రయించే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నది. ఒకవైపు కొత్త పరిశ్రమల స్థాపనకు వివిధ దేశాల కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నప్పటికీ అదే సమయంలో ఇండస్ట్రియల్ పార్కుల్లో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుని విక్రయించాలని భావిస్తున్నది.
ఇలాంటి భూములను ప్రభుత్వం తీసుకుని విక్రయించేందుకు ఉన్న లీగల్ చిక్కులపై అధ్యయనం చేస్తూనే ప్రభుత్వపరంగా అవసరమైన అనుమతులను వెంటవెంటనే క్లియర్ చేసేలా ఉన్నతాధికారులకు ఇప్పటికే సర్కారు నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ కోర్టుల్లో భూములు వివాదాల్లో ఉన్నాయో గుర్తించి ప్రభుత్వపరంగా అఫిడవిట్ లాంటివి సమర్పించడం వల్ల అవి కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంటే ఆ పనులను సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తే పెండింగ్ కేసులకు పరిష్కారం దొరుకుతుందోనని న్యాయశాఖ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నది. మొత్తం ఎన్ని కోర్టుల్లో ప్రభుత్వ భూములకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయో త్వరలోనే లెక్క తీయనున్నది.
గత ప్రభుత్వాలు అసైన్డ్ భూములను పేదలకు మంజూరు చేసినట్లయితే ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం వాటికి ఎక్కువ విలువ ఉన్నట్టు తేలితే వీటికి తగిన పరిహారం ఇచ్చి ఆ భూములను ప్రభుత్వమే తిరిగి తీసుకునేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు గతంలో భూములను మంజూరు చేసినా.. అవి నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటినీ తిరిగి తీసుకుని విక్రయించాలనుకుంటున్నది. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ భూములను గుర్తించడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడి వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీచేస్తున్నది. జిల్లాల కలెక్టర్లకు కూడా ఇదే టాస్కు అప్పగించింది.
ప్రభుత్వ భూముల విక్రయం గురించి సచివాలయంలోని ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. రానున్న ఆరు నెలల్లో మొత్తం ప్రక్రియను కంప్లీట్ చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎన్నికల తర్వాత ఏర్పాడే ప్రభుత్వానికి రానున్న ఐదేండ్ల కాలంలో భూములు లేకుండా పోతాయేమోనని ప్రశ్నించగా.. “ఐదేళ్లంటూ చాలా ఎక్కువ దూరం ఆలోచిస్తున్నారు.. ఆరు నెలల తర్వాత ప్రభుత్వానికి భూములంటూ మిగులుతాయా..’ అని తనదైన శైలిలో అధికారి రిప్లై ఇచ్చారు. బడ్జెట్‌లో కచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన స్కీమ్‌లు, ఇతర అవసరాలు ఉన్నాయని, కానీ వాటికి తగినట్లుగా రెవెన్యూ వనరులు లేవని, మరో ప్రత్యామ్నాయం లేనందువల్లే ప్రభుత్వ భూములను విక్రయించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే రాజీవ్ స్వగృహ ప్లాట్లను, ఫ్లాట్లను ప్రభుత్వం విక్రయించింది. హెచ్ఎండీఏ పరిధిలోని భూముల విక్రయం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెరిగాయని, ఒక్క ఎకరం రూ.20 లక్షలకు తక్కువ లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. భూముల విలువ, ధరలు పెరగడంతో ప్రభుత్వం నాన్-టాక్స్ రూపంలో రెవెన్యూ పెంచుకోవడంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. ఎన్నికల సందర్భంగా కురిపించే హామీలు, వరాలకు తగిన నిధులను మంజూరు చేయాలంటే భూములను అమ్మడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వం ‘నవరత్న’, ‘మినీ రత్న’, ‘మహారత్న’ కంపెనీలను అమ్మేస్తున్నదంటూ ఆరోపిస్తున్న సీఎం.. ఇప్పుడు ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయమే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. కేంద్రం అమ్మితే తప్పులేదు కానీ రాష్ట్రం అమ్మితే తప్పా అని భావిస్తున్నది. ఆత్మరక్షణ విధానాన్ని అవలంబించడానికీ ప్రభుత్వం వెనకాడదల్చుకోలేదనే వాదన అధికారుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం.
Also Read...