- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేవలం ఆ రైతులకే బోనస్.. ఈ ఏడాదే అమలు చేస్తామని మంత్రి ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఈ సంవత్సరం నుంచే అందిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రకటించారు. ప్రతీ క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌ను ఇవ్వనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సన్న రకం పండించే రైతాంగానికి కొనుగోళ్ల సమయంలో ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం 33 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలను కూడా వెల్లడించింది. ఈసారి వానాకాలం సీజన్‌లో ఎన్ని లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతుంది?.. ఇందులో నేరుగా రైస్ మిల్లర్లకు విక్రయించేదెంత?... సొంత అవసరాలకు ఉంచుకునేదెంత?... చివరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చేదెంత?.. ఇలాంటి లెక్కలేసుకుంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. గత వానాకాలంలో వరి దిగబడితో పోల్చుకుని అంచనాలను సిద్ధం చేస్తున్నారు.
గతేడాది వానాకాలం సీజన్‌లో ఐకేపీ (కొనుగోలు కేంద్రాలకు) సెంటర్లకు దాదాపు 47 లక్షల టన్నులకు పైగా వచ్చినట్లు వ్యవసాయ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి ఆగస్టు 7వ తేదీ నాటికి 25.59 లక్షల ఎకరాల్లో వరి నాళ్ళు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి ఇది 34.37 లక్షల ఎకరాలు. గతేడాది రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, సాగునీటి సౌకర్యం అందకపోయినా 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కానీ ఈసారి మాత్రం సాధారణ సాగుతో పోలిస్తే 44.47% మాత్రమే కార్యరూపం దాల్చడంతో ఉత్పత్తి సైతం తగ్గిపోతుందనే అంచనాలు నెలకొన్నాయి. గతేడాది వానాకాలం వరి దిగుబడి అంచనా 99.31 లక్షల టన్నులుగా ఉన్నప్పటికీ అందులో సగం మాత్రమే సాధ్యమైంది. ఈసారి కూడా అదే తీరులో ఉండొచ్చని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.
బోనస్ కోసం రూ. 2 వేల కోట్లు :
గతేడాది ఆగస్టు 7వ తేదీ నాటికి 34.37 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చినా ఈసారి మాత్రం అది 25.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సన్నాలకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున (కనీస మద్దతు ధరకు అదనంగా) రైతులకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినా సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. ఈ నెల చివరకు మరికొన్ని ఎకరాలు సాగులోకి వచ్చినా గతేడాది సాగైన 65 లక్షల ఎకరాల స్థాయికి చేరుకోకపోవచ్చని భావిస్తున్నారు. గరిష్టంగా 35 లక్షల ఎకరాలకు మించి వరి సాగు ఉండదనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో మొత్తం ఉత్పత్తి కూడా గతేడాదికంటే తగ్గే అవకాశమున్నది. గతేడాది ఐకేపీ కేంద్రాలకు 47.34 లక్షల టన్నులే వచ్చినందున ఈసారి ఇది 40 లక్షల టన్నులు దాటకపోవచ్చని అనుకుంటున్నారు. దీంతో బోనస్ కోసం రూ. 2 వేల కోట్లకు మించి అవసరం కాకపోవచ్చని భావిస్తున్నారు.
ఇదే సమయానికి రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసాను కూడా అమలు చేయాల్సి ఉన్నందున దాని కోసం సుమారు ఏడున్నర వేల కోట్లను ప్రభుత్వం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా విధివిధానాలను కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య, దానికయ్యే ఖర్చుపై స్పష్టత వస్తుంది. సాగుచేసే భూములకు మాత్రమే ఇస్తామని, కొండలు, గుట్టలు, రాళ్ళురప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు... ఇలాంటి భూములన్నింటినీ మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ ఆంక్షల నేపథ్యంలో రైతుభరోసాకు గతంలో రైతుబంధుకు కేటాయించిన నిధులకంటే పెరగకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కనీస స్థాయిలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరికి ఇచ్చే బోనస్‌ను కూడా కలుపుకుంటే అత్యధికంగా ఏడున్నర వేల కోట్లు అవసరం కావొచ్చని అంచనా.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 72 వేల కోట్లను కేటాయించింది. ఇందులో రుణమాఫీ కూడా కలిసి ఉన్నది. ఇప్పటివరకు అధికారులు వేసిన లెక్కల ప్రకారం రుణమాఫీకి మూడు విడతల్లో రూ. 18 వేల కోట్లు ఖర్చుకానున్నది. రైతుభరోసా, వరికి బోనస్ రూపంలో అదనంగా మరో రూ. 7,500 కోట్లు (గరిష్ట స్థాయిలో) ఖర్చు కావచ్చు. ఇక రైతుబీమా స్కీమ్‌కు కూడా ఇంకో రూ. 1,500 కోట్లు ప్రభుత్వం ప్రీమియం రూపంలో ఎల్ఐసీకి కట్టనున్నది. ఈ నాలుగు రూపాల్లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం 27 వేల కోట్లను ఖర్చు చేయనున్నది. ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీలో కొద్దిమంది రైతాంగానికి టెక్నికల్ కారణాలతో (ఆధార్, బ్యాంకు ఖాతాల మిస్‌మ్యాచ్) ప్రస్తుతానికి జమ కాకపోయినా గ్రీవెన్స్ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నందున అది అదనంగా నాలుగైదు వేల కోట్లు ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
రుణమాఫీ మినహా రైతుభరోసా, రైతుబీమా, వరికి బోనస్ తదితరాలన్నింటికీ ప్రభుత్వం నిధులను సమీకరించుకోవడం అనివార్యంగా మారింది. అక్టోబరు మొదలు డిసెంబరు వరకు వీటికి ప్రభుత్వం అందించేలా నిధులను సిద్ధం చేసుకోక తప్పదు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇప్పటి నుంచి ఖరీఫ్ (వానాకాలం) పంటకు సన్నాలు సాగుచేసే రైతులకు ఎంత ఖర్చవుతుందనే లెక్కలను అంచనా వేస్తున్నది. ఈ నెల చివరకు వరి నారుమళ్ళ ప్రక్రియ కంప్లీట్ అయితే ఈ అంచనాల్లో కొన్ని మార్పులు జరిగి ఇంకొంత స్పష్టత వచ్చే అవకాశమున్నది.