కేసీఆర్ ఓట్లు..నోట్లు.. సీట్లపైనే శ్రద్ధ

by samatah |
కేసీఆర్ ఓట్లు..నోట్లు.. సీట్లపైనే శ్రద్ధ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ కు ఓట్లు.. నోట్లు.. సీట్ల మీద ఉన్న శ్రద్ధ పరీక్ష నిర్వహణ మీద లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ మండిపడింది. తెలంగాణలో స్కీములు, స్కాములు, లీకులు తప్ప విద్యార్థుల, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయడం లేదని ఆరోపించారు. పేపర్ లీకేజీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.

మంగళవారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పర్లపల్లి రవీందర్, టీ.అమరేందర్, కిశోర్ కుమార్ రెడ్డి మీడియా ప్రకటన విడుదల చేశారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నేడు 10వ తరగతి పరీక్ష పత్రాలు వరుసగా రెండురోజులు లీక్ కావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. ప్రశ్న పత్రాలు లీక్ చేసిన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా పేపర్లు లీకుల వ్యవహారం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలను అంధకారం చేస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీక్ లపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకులకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed