KTR మెడకు బిగుస్తోన్న ‘ఈ- రేస్’ ఉచ్చు.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |   ( Updated:2024-01-12 04:13:21.0  )
KTR మెడకు బిగుస్తోన్న ‘ఈ- రేస్’ ఉచ్చు.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ–రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే.. కేటీఆర్‌ను ఎంక్వయిరీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు చేశామని, ఈ-రేసు నిర్వహణ కోసం హెచ్ఎండీఏ నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. దీని ఆధారంగానే కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉందని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

విచారణ ఎదుర్కోనున్న కేటీఆర్

ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కానీ మొదటి దఫా రేసు పూర్తయిన తర్వాత టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థ ఒప్పందం నుంచి బయటికి వెళ్లి పోయింది. దీంతో ఏబీపీ ఫార్ములా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఒప్పందాన్ని మార్చి హెచ్ఎండీఏ నుంచి ఏబీపీ సంస్థకు రూ.55 కోట్లు చెల్లించినట్టు స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ నోట్ ఫైల్‌లో రాశారు.

ఈ ఫైల్ ఆధారంగానే కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉందని చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతున్నది. సీఎస్ ఇచ్చిన నోటీసుకు అరవింద్ వివరణ ఇస్తూ ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించినట్టు సమాచారం. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా మంత్రివర్గం, ఆర్థిక శాఖ, అనుమతి లేకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే కోణంలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ ఆఫీసర్‌ను విచారించే అవకాశం ఉందని సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

సిట్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ..?

కేసు సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. విచారణ త్వరగా పూర్తయ్యి, దోషులు ఎవరనే విషయం బహిర్గతం చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకు కేసును సిట్‌కు అప్పగించాలా? లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలా? అనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీనిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

అందుకే కేటీఆర్ మౌనం వహించారా..?

ఒప్పందం ప్రకారం ఏబీపీ సంస్థకు డబ్బు చెల్లించనందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. గవర్నమెంట్ అసమర్థత వల్లే ఫార్ములా ఈ–రేసు రద్దయిందని, ఫలితంగా హైదరాబాద్ ఇమేజ్ తగ్గిందని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ రేసు వెనుక జరిగిన ఒప్పందంలో ఏం జరిగిందనే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి బహిర్గతం చేశారు. సెక్రటేరియట్ రూల్స్‌కు విరుద్ధంగా నాటి మంత్రి ఆదేశాల మేరకు అరవింద్ వ్యవహరించారని వెల్లడించారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కనీసం బీఆర్ఎస్ నుంచి ఎవరూ ఖండించలేదు. భవిష్యత్‌లో తనకు ముప్పు వస్తుందనే అనుమానంతోనే కేటీఆర్ మౌనం వహించారనే ప్రచారం జరుగుతున్నది.

అతి విశ్వాసమే కొంప ముంచిందా..

మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తామనే అతి ధీమాతోనే కేటీఆర్ వ్యవహరించిన తీరు ఆయనకు, ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు సమస్యగా మారిందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా హడావుడిగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చినట్టు బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేస్తానని కేటీఆర్ ఇచ్చిన భరోసాతోనే నోట్ ఫైల్‌పై సంతకం పెట్టినట్టు స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలకు 2023 అక్టోబర్ 9న షెడ్యూల్ వచ్చింది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఉండగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే చాన్స్ లేదు. ఒకవేళ అత్యవసరమైతే ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 23 అక్టోబర్ 2023లో ఈ– రేసు ఒప్పందాల్లో మార్పులు చేసి స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్.. ఏబీపీ సంస్థకు రూ.55 కోట్లు చెల్లించారు. మున్సిపల్ మంత్రి ఫోన్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు నోట్ ఫైల్‌లో ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed