వారంలో కొత్త గురుకులాల డిజైన్లు రెడీ!.. రూపొందించిన వాటిపై కీలక సూచనలు చేసిన సీఎం

by Kavitha |
వారంలో కొత్త గురుకులాల డిజైన్లు రెడీ!.. రూపొందించిన వాటిపై కీలక సూచనలు చేసిన సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు వారంలో రెడీ అవుతాయని తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌(సమీకృత గురుకుల విద్యాలయాలు)లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుకు ఇప్పటికే మూడు డిజైన్లు సిద్ధం కాగా, వాటిని సీఎం ఇటీవల పరిశీలించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని మార్పులు చేర్పులను సీఎం సూచించగా.. వాటిని చేసేందుకు ఆర్ అండ్ బీ అధికారులు సంబంధిత ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీలతో కలిసి సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే సీఎం రేవంత్ సూచనల మేరకు మళ్లీ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. ఈ మూడింటిలో ఒక డిజైన్ మాత్రమే ఫైనల్ అవుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ డిజైన్ ఆకారం ఏది డిసైడ్ చేయాలన్న దానిపై ప్రధానంగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకటే డిజైన్?..

ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ మూడు డిజైన్లలో ఒక్కోటి ఒక్కొక్క ఆకారంలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్కిటెక్చర్ సంస్థ మొత్తం ఆరు డిజైన్లు రూపొందించగా, అందులో మూడు డిజైన్లను శాఖ ఆఫీసర్లు సిద్ధం చేసి, సీఎం రేవంత్ అభిప్రాయం కోసం పంపించారు. ఒక డిజైన్ పలక మాదిరి ఉండగా, మరొకటి త్రిభుజ ఆకారంలో, ఇంకొటి గుండ్రని ఆకారంలో ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ మూడు డిజైన్లలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని సీఎంకు ఆఫీసర్లు అభ్యర్థించగా.. ఆకారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పాటించాలా? లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలా అనే విషయంపై స్పష్టత కుదరనట్టు తెలిసింది. విద్యార్థులకు శానిటేషన్, నీటి వసతిపై సీఎం కొన్ని డౌట్లు లేవనెత్తినట్టు తెలిసింది. ఆ విషయంలో స్పష్టత రాగానే, పూర్తిస్థాయి డిజైన్ ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. డిజైన్ ఆకారం డిసైడ్ అయ్యాక ల్యాండ్ సేకరణ కోసం స్థానిక రెవెన్యూ ఆఫీసర్లకు ఆయా ప్రతిపాదనలు వెళతాయని ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొంటున్నారు. అటు తర్వాత ఇంజినీరింగ్ పనులు సైతం ప్రారంభమవుతాయని స్పష్టం చేస్తున్నారు.

శరవేగంగా గురుకులాల పనులు..

గురుకులాల డిజైన్లపై ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు పని చేస్తుండగా, ఈ ప్రాజెక్టు కోసం ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.2 వేల కోట్ల కేటాయింపులు చేయగా, పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో కడుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గకేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టులను చేపట్టనున్నా, రానున్న రోజుల్లో మరిన్ని నియోజకవర్గాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల గురుకులాలను కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్‌గా నిర్మించాలని సర్కారు అభిప్రాయపడుతున్నది. గురుకులాలన్నీ ఒకే చోట ఉన్నట్లయితే వాటి నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పోటీతత్వం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్యాస్ట్, కమ్యూనల్ డిఫరెన్స్ లేకుండా విద్యాబోధన..

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించాలని ప్రభుత్వం తొలుత యోచన చేసింది. నియోజకవర్గకేంద్రంలో ఒకే చోట ల్యాండ్ లేనట్లయితే అదే సెగ్మెంట్‌లోని మరో పట్టణం లేదా మండలకేంద్రంలో కట్టాలని అడుగులు వేస్తున్నది. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలు కూడా నిర్మించే అవకాశాలను స్పీడుగా పరిశీలిస్తోంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను కోరగా.. వారు స్థల సేకరణ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. ఈ గురుకులాల నిర్మాణ బాధ్యతను ఆర్ అండ్ బీ శాఖకు ఇవ్వగా.. ఆ శాఖ ఉన్నతాధికారులు డిజైన్ల రూపకల్పన పూర్తి చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed