రేపే లాస్ట్.. మాజీ సీఎం KCR నిర్ణయంపై నరాలు తెగే ఉత్కంఠ..!

by Satheesh |
రేపే లాస్ట్.. మాజీ సీఎం KCR నిర్ణయంపై నరాలు తెగే ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చలు మొదలయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్‌లైన్ పెడుతుందా..? లేక నిర్దిష్ట గడువు లోగా రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమన్లు ఇస్తుందా..? కమిషన్ నిబంధనలకు స్పందించలేదనే గ్రౌండ్‌తో చర్యలకు ఉపక్రమిస్తుందా..? ఇవీ ఇప్పుడు జరుగుతున్న చర్చలు.

డెడ్‌లైన 15వ తేదీనే

ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపైనా, రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపైనా, టెండర్ విధానాన్ని పాటించకపోవడంపైనా కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కమిషన్ నుంచి కేసీఆర్‌కు నోటీసు వెళ్లిందని, ఎన్నికల హడావుడి ఉన్నందున జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్టు చేశారని కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. గత నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఆ హడావుడి ఏదీ లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కిచెప్పినట్లు తెలిసింది. ఆ డెడ్‌లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డే మీడియాకు వెల్లడించారు.

నో ఎక్స్‌టెన్షన్

కేసీఆర్ కోరినట్లుగా గడువు పొడిగించబోమని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉన్నందున జూన్ 15 వరకు ఇవ్వాల్సిందేననే క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ రెడ్డి వివరించారు. కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్‌కు ఎలాంటి రిప్లై రాలేదని ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. గతంలో సూచించినట్లుగానే జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రానిపక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడడం, జూన్ 6 నుంచి ఎలక్షన్ కోడ్ ఎత్తేయడంతో కేసీఆర్ గతంలో ప్రస్తావించిన ‘ఎలక్షన్ హడావుడి’ ఏమీ లేనందున రిప్లై ఇవ్వడానికి ఆ రీజన్ అడ్డంకి కాదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. కమిషన్‌కు రిప్లై రాక పోతే సమన్లు జారీ చేసే అవకాశాలపైనా జోరు గా చర్చలు జరుగుతున్నాయి.

కీలకం కానున్న కేసీఆర్ రిప్లై

కమిషన్ ఆదేశించినా కేసీఆర్ స్పందించని కారణంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు.. అనే అంశాన్ని కేసీఆర్‌కు జారీ చేసే సమన్లలో ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు సురేశ్ చందా, అరవింద్ కుమార్ సహా ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీహెచ్ఈఎల్ అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలను తీసుకున్నది. వారు వెల్లడించిన వివరాలను పరిగణనలోకి తీసుకునే కమిషన్.. కేసీఆర్ నుంచి వచ్చే రిప్లై, అందులో ఆయన ఇచ్చి వివరణను స్టడీ చేయాలనుకుంటున్నది. కానీ ఇప్పటివరకు కేసీఆర్ నుంచి రిప్లై రాకపోవడంతో తదుపరి కమిషన్ ఎలా స్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది. మరోసారి అవకాశం ఇచ్చి కొత్త తేదీని ఖరారు చేసి డెడ్‌లైన్ విధిస్తుందా?.. లేక హెచ్చరిస్తుందా?.. అనేది కీలకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed