రైతులకు మళ్లీ Bad News.. ఐదున్నర గంటల భేటీలో రుణమాఫీపై క్యాబినెట్ సైలెంట్..!

by Satheesh |   ( Updated:2023-08-01 02:39:36.0  )
రైతులకు మళ్లీ Bad News.. ఐదున్నర గంటల భేటీలో రుణమాఫీపై క్యాబినెట్ సైలెంట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ అమలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం నుంచి తీపి కబురు రాలేదు. సెకండ్ టర్ము ఎన్నికలప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినా ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదు. కేవలం రూ. 35 వేల వరకు రుణం ఉన్న 5.26 లక్షల మందికి మాత్రమే మాఫీ అయింది.

మరో నాలుగైదు నెలల్లో ఈ టర్ము పూర్తి కావస్తున్నందున మిగిలిన రైతులకు రుణాలను మాఫీ చేస్తుందా లేదా అనే గందరగోళం రైతుల్లో నెలకొన్నది. మంత్రివర్గం ఐదున్నర గంటల పాటు సమావేశమైనా రుణమాఫీ గురించి చర్చించకపోవడం రైతుల్ని నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకూ మాఫీ కాకపోవడంతో వాటి మీద వడ్డీ భారాన్ని రైతులే మోయాల్సి వస్తున్నది. ఇంకెంతకాలం ఈ భారాన్ని మోయాలన్నదే వారి ఆవేదన.

దీనికి తోడు బ్యాంకులు కొత్తగా అప్పులు ఇవ్వడంలేదు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా రైతుబంధు డబ్బుల్ని కొన్ని బ్యాంకు శాకలు మినహాయించుకుంటున్నాయి. దీంతో రైతులకు రైతుబంధు పడిందన్న తృప్తి కూడా మిగలడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లను కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.

రైతుల ఖాతాల్లో అవి జమ కాలేదు. నాలుగేళ్ళు పూర్తయినా అమలుకు నోచుకోకపోవడంతో రాబోయే నాలుగు నెలల్లో ఏ మేరకు అవుతుందనే అనుమానాలు రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ విషయాన్ని క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించాల్సిన అవసరం లేకపోయినా రైతుల గురించి మంత్రులు పట్టించుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

డెడ్‌లైన్ పెట్టిన కాంగ్రెస్:

వారం రోజుల్లో రుణాలను మాఫీ చేయకుంటే బ్యాంకుల ముందు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. క్యాబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి ముందే ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అర్హులైన రైతులందరికీ వారం రోజుల్లోగా (ఆగస్టు 7) మాఫీ కాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రైతుల పక్షాన ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

రుణమాఫీ చేయని సర్కారు తీరును ఎండగట్టాలని, గ్రామాల్లోకి వచ్చే బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని రైతులకు జూలై 16న రాసిన ఓపెన్ లెటర్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని, కానీ రైతులు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తావించాల్సి వస్తున్నదన్నారు.

ఇప్పటికీ రైతులు అప్పులు బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని, ఆ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఒత్తిడి చేయడం రైతుల పక్షాల విపక్ష పార్టీగా తమ బాధ్యత అని రేవంత్ నొక్కిచెప్పారు. ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా, ఈ స్కీమ్ కోసం కేటాయింపులు చేసినా ఇప్పటివరకూ మాఫీ చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారానికి, వివిధ అవసరాలతో గ్రామాల్లోకి వచ్చే అధికార పార్టీ నేతలను చుట్టముట్టి రుణమాఫీ డిమాండ్‌ను సాధించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్‌తో వారం రోజుల డెడ్‌లైన్ పెట్టడంతో బ్యాంకుల ముందు ధర్నాలతో మొదలుపెట్టి సీరియస్ కార్యాచరణకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది.

మూడు కోట్ల టన్నులు పండిస్తున్నా..:

సాగునీటి సౌకర్యం పెరగడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని, దేశంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవించిందని, పంజాబ్‌ను కూడా అధిగమించామని కేసీఆర్ ఇటీవల పలు సందర్భాల్లో గర్వంగా ప్రకటించారు. ఏడాదికి మూడు కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేస్తున్నామని, ఈ తాకిడిని తట్టుకోడానికి అదనంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నదని, నిల్వ చేసుకోడానికి గోదాములను కూడా కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, రైతులకు ప్రయోజనం కలిగేలా అంతర్జాతీయ ‘సటాకే’ సంస్థ తరపున కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా వ్యవసాయం, రైతుల గురించి చెప్పినా రుణమాఫీ విషయంలో మాత్రం హామీని సంపూర్ణంగా అమలు చేయకపోవడమే వారికి వేదన కలిగిస్తున్నది.

రుణమాఫీ కోసం మొత్తం రూ. 27 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నా నిధుల్ని విడుదల చేయకపోవడంతో ఆ స్కీమ్ అటకెక్కింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆ లోపు అమలు చేస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నా కీలకమైన క్యాబినెట్ సమావేశంలో దీని గురించి మంత్రులెవరూ చర్చించకపోవడంతో నీరసపడ్డారు.

విపక్షాలకు అస్త్రంగా రుణమాఫీ:

కాంగ్రెస్ ఇప్పటికే రుణమాఫీపై ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించగా.. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. లక్ష రూపాయల మేర రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణంగా అమలు చేయలేదని, ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.

హైదరాబాద్‌లో కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఈ నెల 27న ప్రారంభించిన సందర్భంగా ఈ రెండు హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. చివరకు పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వారిని ఆదుకోడానికి కూడా కేసీఆర్ ముందుకు రాలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో రుణమాఫీ అంశాన్ని రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా వినియోగించుకుని మైలేజ్ పొందాలనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : గ్రూపులుగా విడిపోయిన బీఆర్‌ఎస్‌.. సిట్టింగ్‌కు కష్టమే..!

Advertisement

Next Story