పట్టాలిప్పిస్తామని బ్రోకర్ల దందా.. రిటైర్డ్ ఆఫీసర్ కీ రోల్

by Sathputhe Rajesh |
పట్టాలిప్పిస్తామని బ్రోకర్ల దందా.. రిటైర్డ్ ఆఫీసర్ కీ రోల్
X

దిశ, నల్లగొండ బ్యూరో: గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుమారు రెండేళ్ల నుంచి ప్రభుత్వం అనేక రకాలుగా సర్వేలు విచారణలు చేస్తూ వస్తుంది. ఇదే సమయంలో అధికారులు కొంతమంది బ్రోకర్లు కలిసి గిరిజనులు, గిరిజనేతరుల నుంచి భూములపై హక్కు పట్టాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధిత శాఖ కార్యాలయంలో ఉన్న అధికారులతో పాటు కొంతమంది బ్రోకర్లు కూడా ఈ తతంగంలో హస్తం ఉన్నట్లు సమాచారం.

నల్లగొండ జిల్లాలో 20,466 మంది ధరఖాస్తులు

గత కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పోడు భూములు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 20,466 మంది ఉన్నారు. అందులో 15 వేల మంది గిరిజనులు కాగా మరో 5 వేలకు పైగా గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు.

సాగవుతున్న పోడుభూమి మొత్తంగా 55, 750 ఎకరాలుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో కూడా ఇంకా అర్హత లేని వారు ఉంటే తొలగించాలని కోణంలో క్షేత్రస్థాయి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గిరిజనులు 50 సంవత్సరాలు సంబంధిత భూమిపై సాగులో ఉండాలని గిరిజనేతరులు అయితే 75 ఏళ్లు సాగులో ఉండాలని అలాంటి వారికి మాత్రమే పోడుపై హక్కు కల్పిస్తూ పట్టాలిస్తామని ప్రభుత్వం నిబంధనలు విధించింది.

పట్టాల పేరుతో లక్షల్లో వసూలు

భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కుపత్రాలు అందజేసే వ్యవహారం అధికారులకు, బ్రోకర్లకు కలిసివచ్చింది. ఆ పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎక్కువమంది గిరిజనేతరుల నుంచి డబ్బులు వసూలు అవుతున్నట్లు సమాచారం. గిరిజన ప్రాంతాల్లో మొత్తంగా 75 ఏళ్లకు పైగా సాగులో ఉన్న గిరిజనేతరులు ఎక్కడ కనిపించరు.

ప్రస్తుతం భూముల విలువలు పెరిగిన తర్వాత కొంతమంది అటవీ భూములను కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం చూస్తే అలాంటి వారికి హక్కు పత్రాలు దక్కవు కాని అధికారులు హక్కుపత్రాలు ఇప్పిస్తామని చెబుతూ సాగు విస్తీర్ణం బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు రెండు వేలకు పైగా మంది రైతుల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు వసూళ్ల దందా నడిచినట్టు తెలుస్తుంది

అధికారే కీలక సూత్రధారి ..?

నల్లగొండ జిల్లాలోని సంబంధిత గిరిజన శాఖలో పోడు భూముల అంశానికి సంబంధించిన సెక్షన్‌ను ఓ విశ్రాంత అధికారికి అప్పగించారు. ఆయనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో నుంచి తనకు అనుకూలమైన కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందులో బ్రోకర్లకు 10 నుంచి 15 శాతం వరకు సొమ్ము తీసుకొని మిగతా డబ్బంతా శాఖ అధికారులకు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో శాఖ ఉన్నతాధికారి హస్తం లేకుండా భారీ స్థాయిలో వసూళ్లు చేయరనేది నగ్న సత్యం.

మండలాల వారీగా గిరిజనులు గిరిజనేతరులు ఎంతమంది ఎంతకాలం నుంచి సాగు చేసుకుంటున్నారు అనే విషయాలు బయటపడితే ఎక్కడ తమ వసూళ్ల తతంగం బయట పడుతుందోనని జాబితా బయటికి రాకుండా ఈ అధికారులు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా సెక్షన్ బాధ్యుల్నిఅడిగితే జిల్లా అధికారులని వారిని అడితే ఉన్నతాధికారిని అడగాలని సాకు చూపుతూ ఎట్టి పరిస్థితుల్లో లీస్టు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. దీనిపై జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అర్హత కలిగిన రైతులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed