- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌పై సాఫ్ట్ కార్నర్.. బీజేపీపైనే కాంగ్రెస్ మెయిన్ ఫోకస్!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల తీరు చర్చనీయాంశంగా మారింది. మాటల్లో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటూనే ఆచరణలో మాత్రం ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమైంది. బీజేపీ మీద విమర్శలు చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించింది. ఎలాగూ బీజేపీని అధికార బీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో మొత్తం క్రెడిట్ ఆ పార్టీ కొట్టేసింది. అదే అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకోవడంతో రావాల్సినంతటి మైలేజ్ రాలేదనే చర్చలు అసెంబ్లీ లాబీల్లో మొదలయ్యాయి. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు కావడంతో ఒక్కో స్కీమ్ లేదా శాఖకు సంబంధించిన పద్దులపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి, విమర్శించడానికి, లోపాలను ఎత్తి చూపడానికి మరే పార్టీకంటే కాంగ్రస్‌కు ఎక్కువ అవకాశం ఉన్నా ఆ దిశగా కృషి చేయలేదన్న కామెంట్లు వినిపించాయి.
ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో కాంగ్రెస్ వ్యవహరించిందని, బీజేపీపై ఎక్కువ ఫోకస్ పెట్టి విమర్శలు చేయడానికే ఇది కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్రలు, నిరసన ప్రదర్శనల సమయంలో ధరణి, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, నిరుద్యోగ సమస్య, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్, ఫీజు రీఇంబర్స్ మెంట్, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలు, గృహ విద్యుత్ వినియోగంలో ఏసీడీ చార్జీల వసూలు తదితర అనేక అంశాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ వేదికగా వాటిని కాంగ్రెస్ సభ్యులు పెద్దగా ప్రస్తావించలేదు. ఒకవైపు ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలకు దిగినా సభ లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం వాటిని గాలికొదిలేశారన్న విమర్శలు వినిపించాయి.
ఆ పార్టీకి ఉన్న ఐదుగురు సభ్యుల్లో సీతక్క ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో నిమగ్నం కావడంతో ఆ తర్వాత సభకు హాజరుకాలేదు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఇరిగేషన్, దళితబంధు, ధరణి లాంటి అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించినా ఓవరాల్‌గా బడ్జెట్ అంశాలపైనా, ప్రభుత్వ పనితీరుపైనా దూకుడు ప్రదర్శించలేకపోయిందని అధికార పార్టీ సభ్యులే గుసగుసలాడుకుంటున్నారు. కనీసం మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ చేసినంతటి స్థాయిలోనూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఒక దశలో శాసన వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ హన్మంత్ షిండేకు విజ్ఞప్తి చేశారు.
వివిధ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వివరాలు ఇస్తున్నా ప్రతిపక్ష సభ్యులు సభలో లేరని, రాజకీయ విమర్శలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే హాజరై ఆ తర్వాత బైటకు వెళ్ళిపోతున్నారని వ్యాఖ్యానించారు. పద్దుల సమయంలో బడ్జెట్ కేటాయింపులపై చర్చలో సీరియస్‌గా పాల్గొని ప్రజల తరఫున ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ బాధ్యతా రాహిత్యంగానే వ్యవహరించింది. ఎమ్మెల్యే పోదెం వీరయ్య కొన్నిసార్లు చర్చల్లో పాల్గొన్నా ఆయన ఎస్టీల సమస్యలు, పోడు భూములు, భద్రాచలం నియోజకర్గానికి సంబంధించిన అంశాలకే పరిమితమయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సాగునీటిపారుదల రంగం లాంటి కొన్ని అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడినా ప్రతిపక్షం వ్యవహరించాల్సిన స్థాయిలో లేదనే వాదన తెరపైకి వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఒక దశలో కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బీజేపీకి దగ్గర కావద్దని ఆనాడే తాను చెప్పామని, కానీ లెక్క చేయలేదని, చివరకు తమ పార్టీ అనుమానించిందే నిజమైందని వ్యాఖ్యానించింది. నిజానికి బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అంశాన్ని సభలో లేవనెత్తి కీలకమైన బిల్లుల వియంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించిందనే కోణం నుంచి కనీస స్థాయిలోనైనా ప్రస్తావించలేదు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వంతపాడేలా బల్లలు చరచడం సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఎండగడుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ అదే స్థాయిలో నిలదీయడంలో విఫలమైందనే విమర్శలు వినిపించాయి.
కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని, నెహ్రూ ఫిలాసఫీని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ త్యాగాలను గొప్పగా చెప్పుకోవడం లేదా బీజేపీని విమర్శించడంపై ఫోకస్ పెట్టింది. అదే స్థాయిలో బీఆర్ఎస్‌ను కార్నర్ చేయడంలో మెతక వైఖరి అవలంబించిందనేది ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రత్యేకత. బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు ఆదాయ వనరులను ప్రభుత్వం ఎలా సమీకరించుకుంటుంది.. గత బడ్జెట్‌లో కేటాయింపులు చేసుకున్నా నిధులను ఎందుకు విడుదల చేయలేకపోయింది.. దళితబంధుకు ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు.. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సర్పంచ్‌లకు సర్కారు నుంచి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం, వారి ఆత్మహత్యలు తదితరాలపై ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయింది.