- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ భూమి కబ్జా చేసిన అధికార యంత్రాంగం.. తెర వెనుక బడా నేతలు!
దిశ, తెలంగాణ బ్యూరో: భూమిని కాపాడాల్సిన అధికార యంత్రాంగమే కబ్జాకు పాల్పడుతున్నది. అది కూడా ప్రజా ప్రయోజనాల కోసమేం కాదు. పక్కనే ఉన్న రూ.కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాల కోసం కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. అడిగితే తీర్మానం చేసేసుకున్నాం.. పనులు ఆపేదే లేదని మున్సిపల్ అధికారులు అంటున్నారు. కనీసం తమకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా రోడ్డు ఎలా వేస్తారంటూ దేవాదాయ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజం రూ.లక్షల్లో పలికే రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలో ఆలయ భూమిలో సిమెంటు రోడ్డు వేస్తుండడం విశేషం. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలోని కీర్తి వెస్ట్ విండ్స్ లగ్జరీ విల్లాస్ ఉన్నాయి.
లగ్జరీ ఎస్టేట్స్ వాళ్లు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఆలయ భూమి నుంచి వేసే రోడ్డు ద్వారా అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ ప్రాజెక్టులో సంపన్నులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు విల్లాలు కొనుగోలు చేశారు. ఆ విల్లాలకు మరింత సౌలభ్యంగా ఉండేందుకే అధికారికంగా రోడ్డు వేయిస్తుండడం విశేషం. తెర వెనుక పెద్ద నేత తతంగాన్ని నడిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ స్థలంలో నుంచి ప్రైవేటు ప్రాజెక్టుకు మేలు కలిగించేందుకు రోడ్డు వేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. కీర్తి వెస్ట్ విండ్స్ కోసమే అధికారులు కూడా ఆమోదించారు. ప్రజల సొమ్ముతో రూ.లక్షలు వెచ్చించి రోడ్డు వేస్తున్నారు. దీనికి మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఆమోదముద్ర వేశారు. మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఓ బడా నేత ఒత్తిడితోనే తీర్మానం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
పనులు ఆపం
మంచిరేవులలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పేరిట సర్వే నం.303లో 16.01 ఎకరాల స్థలం ఉన్నది. ఎన్నాండ్లుగానే దేవాదాయ శాఖ కాపాడుతూ వస్తున్నది. ఐతే అక్రమార్కుల నుంచి ప్రమాదాన్ని పసిగట్టారు. కానీ మున్సిపల్ అధికారులే ఈ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేస్తారని ఊహించలేదు. శుక్రవారం సీసీ రోడ్డు వేస్తున్నారని తెలుసుకున్న ఆలయ ఈవో నరేందర్ కాపాడేందుకు ప్రయత్నించారు. ఎవరో రోడ్డు వేస్తున్నారంటూ మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్తే తామేనని ఒప్పుకున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోని భూమిలో రోడ్డు ఎందుకు వేస్తున్నారని అడిగితే మున్సిపాలిటీలో తీర్మానం చేశామని, అందుకే పనులు నడుస్తున్నాయని నార్సింగి కమిషనర్ సత్యబాబు చెప్పారు. కనీసం తమను సంప్రదించకుండానే ఎలా వేస్తారని, పనులు ఆపివేయాలని ఎంతగా కోరినా ససేమిరా అన్నారని ఆలయ ఈవో నరేందర్ ‘దిశ’కు తెలిపారు. అందుకే తాము నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఇక పోలీసులు కూడా ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
విల్లాస్ దారేది?
కీర్తి వెస్ట్ విండ్స్ ప్రాజెక్టు అనుమతులు పొందేందుకు దారి ఎక్కడి నుంచి చూపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేవాదాయ శాఖ స్థలాన్ని చూపించడం ద్వారా హెచ్ఎండీఏ పర్మిషన్లు పొందిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఆగమేఘాల మీద సిమెంటు రోడ్డు వేయించుకునేందుకు వ్యూహరచన చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పెద్ద నేతల ద్వారా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను మెప్పించి ప్రజాధనంతో రోడ్డు వేయించుకుంటున్నారు. అనుమతులకు ముందు ప్రాజెక్టు ఎక్కడి నుంచి రోడ్డు వేస్తుంది? ఎవరి స్థలమది? అనే కోణంలో విచారించకుండానే అప్రూవల్ ఇచ్చారా? అన్ని తెలిసే జారీ చేశారా? అన్న విషయాలు తేలాలి. ఐతే విల్లాస్ కొనుగోలు చేసిన వారంతా పలుకుబడి, ఆర్ధిక బలం ఉన్నోళ్లు కావడంతో అవన్నీ అటకెక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.
మౌనం
మంచిరేవుల సర్వే నం.303లోని వేణుగోపాల స్వామి ఆలయ భూమిలో సిమెంటు రోడ్డు వేస్తున్నారని, అది కీర్తి విల్లాస్ కోసమేనన్న ఆరోపణలు ఉన్నాయని.. దీనిపై వివరణ ఇవ్వాలని నార్సింగి మున్సిపల్ కమిషనర్ సత్యబాబును కోరగా రిప్లై ఇవ్వలేదు. దిశ ప్రతినిధి ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. కనీసం దేవాదాయ శాఖ అనుమతికి ఎన్వోసీ తీసుకున్నారా అన్న విషయంపైనా సమాధానం రాలేదు.